టీమిండియాను టెన్షన్ పెడుతున్న రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ

First Published | Jun 21, 2024, 11:57 PM IST

Rohit Sharma-Virat Kohli : టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌-విరాట్ కోహ్లీల జోడి భారత అభిమానుల టెన్షన్‌ని పెంచింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 మ్యాచ్‌లో హిట్‌మాన్, విరాట్ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ లు ఆడ‌లేక‌పోయారు.
 

T20 World Cup 2024 :  టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతోంది. అయితే, టీమిండియా స్టార్ సీనియ‌ర్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌-విరాట్ కోహ్లీల‌ జోడీ భారత అభిమానుల టెన్షన్‌ని పెంచింది. మరోసారి భయపడిందే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 మ్యాచ్‌లో రోహిత్, కింగ్ కోహ్లీ పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండానే పెవిలియ‌న్ కు చేరారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత హిట్ మ్యాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ వ‌స్తుంద‌ని ఆశించారు కానీ, హిట్‌మెన్ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ ప్ర‌పంచ క‌ప్ ఆరంభం నుంచి నిరాశ‌ప‌రుస్తున్న కింగ్ కోహ్లీ.. వెస్టిండీస్ పిచ్‌పై కూడా త‌న ఫ్లాప్ షోను కొన‌సాగించారు. 


సూపర్-8 తొలి మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా రోహిత్-కోహ్లీలు ఓపెనింగ్‌కు రావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎడమ చేయి పేసర్లను ఎదుర్కోవ‌డంలో ఇబ్బంది ప‌డుతున్న‌ హిట్‌మెన్.. ఈసారి కూడా ఆఫ్ఘనిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫజార్హక్ ఫరూఖీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. కేవలం 8 పరుగుల స్కోరు వద్ద రోహిత్ శర్మ తన వికెట్‌ను ఇచ్చాడు. 

ఏ ఫార్మాట్‌లోనైనా లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు వేసిన బంతుల్లో రోహిత్ శర్మ ఇబ్బందుల్లో ప‌డుతూనే ఉన్నాడు. టీ20 క్రికెట్ గురించి మాట్లాడితే, రోహిత్ 19 ఇన్నింగ్స్‌లలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల చేతిలో 8 సార్లు ఔట్ అయ్యాడు. సూపర్-8లో రోహిత్ ఈ బలహీనత భారత జట్టులో టెన్షన్ పెంచింది.

Virat Kohli, RohitSharma

రోహిత్ శ‌ర్మ‌కు తోడుగా, న్యూయార్క్ పిచ్‌ల నిరాశ‌ప‌రిచిన ర‌న్ మిష‌న్ కింగ్ కోహ్లీ.. వెస్టిండీస్‌లో కూడా త‌న  ఫ్లాప్ షో కొన‌సాగించాడు. ఆఫ్ఘ‌న్ స్టార్ బౌల‌ర్ రషీద్ ఖాన్ 24 పరుగుల స్కోరు వద్ద విరాట్ ను పెవిలియన్ కు పంపాడు. 

అయితే, బౌల‌ర్లు, బ్యాటింగ్ లో సూర్య‌కుమార్ యాద‌వ్, హార్దిక్ పాండ్యాలు రాణించ‌డంతో ఆఫ్ఘ‌నిస్తాన్ పై  టీమిండియాదే పైచేయి క‌నిపించింది. అయితే ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకు బ‌ల‌మైన‌ ఆస్ట్రేలియా జ‌ట్టు నుంచి ఇబ్బందులు పెరిగే అవ‌కాశ‌ముంది.

ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 24లోగా రోహిత్-కోహ్లి తమ పాత టచ్‌కి రాకపోతే టీమ్ ఇండియా కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భార‌త జ‌ట్టు త‌న త‌ర్వాతి మ్యాచ్ ల‌లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాల‌తో త‌ల‌ప‌డ‌నుంది. 

Latest Videos

click me!