Rohit Sharma: పిక్చర్ అబి బాకీ హై మేరా దోస్త్..! రోహిత్ ఆరోగ్యంపై స్పందించిన టీమిండియా హెడ్ కోచ్

First Published Jun 30, 2022, 11:36 AM IST

IND vs ENG 5th Test: శుక్రవారం నుంచి బర్మింగ్హోమ్ వేదికగా  ఇంగ్లాండ్ తో జరగాల్సి  ఉన్న  టెస్టు మ్యాచ్ కు రోహిత్ శర్మ ఆడతాడా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది.. అయితే తాజాగా  ఈ విషయమై రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. 

టీమిండియా సారథి రోహిత్ శర్మకు కరోనా సోకడంతో ప్రస్తుతం అతడు ఐసోలేషన్ లో గడుపుతున్నాడు.  బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కూడా  రోహిత్ కు పాజిటివ్ అనే తేలింది. దీంతో ఐదో టెస్టుకు అతడు అందుబాటులో ఉండేది అనుమానమే అని వార్తలు వస్తున్నాయి. 

రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే టీమిండియా సారథ్య బాధ్యతలు జస్ప్రీత్ బుమ్రాకు అప్పజెప్పనున్నారని ఈ మేరకు బుమ్రా కు ఇప్పటికే ఈ విషయాన్ని చేరవేశారని కూడా  బుధవారం రాత్రి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

అయితే రోహిత్ శర్మ ఈ టెస్టులో ఆడేదీ లేనిదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.  అందుకింకా సమయముందని గురువారం తుది నిర్ణయం వెల్లడిస్తామని తెలిపాడు. 

రోహిత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడని.. బుమ్రాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తల నేపథ్యంలో  ద్రావిడ్ మాట్లాడుతూ.. ‘లేదు. రోహిత్ ఇంకా ఈ టెస్టు నుంచి తప్పుకోలేదు. ఎడ్జబాస్టన్ టెస్టు ప్రారంభానికి ఇంకా రెండు రోజులు (బుధవారం రాత్రి ద్రావిడ్ చెప్పినప్పుడు) ఉంది.

బుధవారం నిర్వహించిన కరోనా పరీక్షలో అతడికి పాజిటివ్ అని తేలింది. గురువారం సాయంత్రం కూడా  హిట్ మ్యాన్ కు మళ్లీ ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేస్తాం.  అప్పుడు కూడా రోహిత్ కు పాజిటివ్ అని వస్తే అప్పుడు తుది నిర్ణయం ప్రకటిస్తాం. కానీ మాకింకా రెండ్రోజుల టైమ్ ఉంది..’ అని  తెలిపాడు. 

గతవారం లీస్టర్షైర్ తో  ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ జూన్ 26 (ఆదివారం) రోహిత్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. దీంతో అతడు ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు. గడిచిన నాలుగు రోజులుగా అతడు ఐసోలేషన్ లోనే గడుపుతున్నాడు. 

ఇక ఈ టెస్టులో రోహిత్ ఆడేది అనుమానమే అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.  ప్రస్తుత పరిస్థితులు చూస్తే రోహిత్ ఇప్పుడప్పుడే కోలుకునేట్టు కనిపించడం లేదని.. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా సారథ్య పగ్గాలు చేపడతాడని బీసీసీఐకి చెందిన ఓ  ప్రతినిధి తెలిపాడు. బుమ్రా కు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పితే కపిల్ దేవ్ తర్వాత భారత టెస్టు జట్టుకు సారథ్యం వహించే తొలి సారథి కానున్నాడు. 

అయితే బుమ్రాకు పగ్గాలు అప్పజెప్పడంపై ద్రావిడ్ స్పందిస్తూ.. ‘ఇప్పుడే దీని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది.  ఈ విషయంలో మేము తుది నిర్ణయం ప్రకటించేవరకు వేచి ఉండండి..’ అని  వెల్లడించాడు. 
 

click me!