అందుకే తప్పుకున్నాడా..? ఊతప్ప రిటైర్మెంట్‌పై ఆసక్తికర విషయాలు వెలుగులోకి..

First Published Sep 15, 2022, 12:16 PM IST

Robin Uthappa Retirement: టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప బుధవారం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తున్న ఊతప్ప రిటైర్మెంట్ కు గల కారణాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. 

2002లో క్రికెట్ కెరీర్  ప్రారంభించిన రాబిన్ ఊతప్ప..  2007లో భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్ తరఫున ఆడేందుకు పెద్దగా అవకాశాలు రానప్పటికీ.. దేశవాళీతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఊతప్ప రాణించాడు. 36 ఏండ్ల ఈ కర్నాటక బ్యాటర్ బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 

అయితే ఊతప్ప రిటైర్మెంట్ ప్రకటన వెనుక పెద్ద ప్లానింగే ఉందని తెలుస్తున్నది. భారత జట్టులో  రావడానికి ఊతప్పకు అవకాశం లేదు. అలా అని ఊతప్ప  ఆగిపోలేదు. తన సత్తా ఏంటో ఐపీఎల్ అభిమానులతో పాటు దేశవాళీ క్రికెట్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి తెలుసు. టీ20 క్రికెట్ లో ఊతప్ప ఇంకా మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడు. 

దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నట్టు.. ఒంట్లో క్రికెట్ ఆడే సత్తువ ఉన్నప్పుడే డబ్బులు వెనకేసువాలని  ఊతప్ప  కూడా భావిస్తున్నాడు. ఐపీఎల్  మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ లకు ఇప్పుడు భారీ గిరాకీ ఉంది.  

ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్, ఇంగ్లాండ్ లో గతేడాది మొదలైన ‘ది హండ్రెడ్’ లీగ్, వెస్టిండీస్ లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)తో పాటు వచ్చే ఏడాది రెండు కొత్త లీగ్ లు కూడా రాబోతున్నాయి. 

యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో క్రికెట్ వ్యాప్తి లక్ష్యంగా అక్కడ వచ్చే ఏడాది ప్రారంభంలో ఇంటర్నేషనల్  టీ20 లీగ్ జరగాల్సి ఉంది. దీంతో పాటు సౌతాఫ్రికా వేదికగా  ఎస్ఏటీ20 లీగ్ జరుగనున్నది. ఇక్కడ ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ యజమానులే దక్కించుకున్నారు. అదీగాక ఐఎల్ టీ20 లో కూడా నాలుగు జట్ల యజమానులు ఐపీఎల్ ఓనర్లే.  

దీంతో ఒక్క ఐపీఎల్ ను నమ్ముకుని ఇక్కడే ఉండటం కంటే  భారత క్రికెట్ తో బంధం తెంచుకున్నదే బెటరని ఊతప్ప భావిస్తున్నాడని అతడి సంబంధీకుల నుంచి వినిపిస్తున్న మాట. భారత క్రికెట్ తో  బంధం తెంచుకుంటే ఫారెన్ లీగ్స్ లో ఆడొచ్చు. అందుకే తాను చివరిసారిగా రంజీలలో ఆడిన కేరళ క్రికెట్ అసోసియేషన్ వద్ద ఊతప్ప  నో ఆబ్జెక్షన్ లెటర్ అడిగినట్టు సమాచారం.  

కేరళ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే తర్వాత బీసీసీఐ నుంచి కూడా  అదే సర్టిఫికెట్ పొందితే ఫారెన్ లీగ్స్ లో ఆడే అవకాశముంటుంది. ఈ ఏడాది మేలోనే ఊతప్ప బీసీసీఐ  వద్ద కూడా ఈ విన్నపం పెట్టినట్టు తెలుస్తున్నది. ఇదే  నిజమైతే రాబోయే రోజుల్లో  ఊతప్ప  ఫారెన్ లీగ్స్ లో కనిపించడంలో ఆశ్చర్యమేమీ కాదు. 

click me!