పంత్ కు అంత సీన్ లేదు.. బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వొద్దు : పాక్ మాజీ స్పిన్నర్ కామెంట్స్

First Published Jun 27, 2022, 3:50 PM IST

IND vs ENG: రోహిత్ శర్మ గైర్హాజరీలో ఇటీవలే స్వదేశంలో ముగిసిన సఫారీ సిరీస్ లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రిషభ్ పంత్.. ఆ స్థానానికి సరైనోడు కాదని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ కామెంట్స్ చేశాడు. 

దక్షిణాఫ్రికాతో ఇటీవలే ముగిసిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో టీమిండియాకు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు రిషభ్ పంత్. అయితే అతడికి టీమిండియా పగ్గాలు చేపట్టే  సామర్థ్యం లేదని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా. 

తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘రిషభ్ పంత్ కు టీమిండియా సారథ్యం వహించే సత్తా ఇంకా రాలేదు. సఫారీ సిరీస్ లో అతడికి రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ వచ్చింది. అయితే ఈ బాధ్యతలు మోసేంత  అనుభవం అతడికి లేదు. 

కెప్టెన్సీగా అతడు పనికిరాడు. ఈ సిరీస్ లో అతడు సారథిగా విఫలమయ్యాడు. కెప్టెన్సీ ప్రభావం అతడి బ్యాటింగ్ మీద కూడా పడింది. నా అభిప్రాయం ప్రకారమైతే అతడికి మళ్లీ ఈ బాధ్యతలు అప్పజెప్పకుండా ఉంటేనే మంచిది..’ అని తెలిపాడు. 

ఇక ఇంగ్లాండ్ తో ఐదో టెస్టులో రోహిత్ శర్మకు కరోనా సోకడంతో కెప్టెన్సీని రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ లకు అప్పగించడం కూడా వృథా ప్రయాస అని కనేరియా చెప్పాడు. 

‘రోహిత్ శర్మ కు కరోనా సోకిన నేపథ్యంలో ఆ స్థానంలో రిషభ్ పంత్, జస్స్రీత్ బుమ్రా, అశ్విన్ కు అందించాలని బీసీసీఐ భావిస్తున్నది. హిట్ మ్యాన్ అందుబాటులో లేకుంటే  ఆ స్థానంలో బుమ్రాను సారథిగా నియమించకూడదు.

దాంతో అతడు తన బౌలింగ్ లో లయ కోల్పోతాడు. నేనైతే అతడు టీమిండియాకు కెప్టెన్సీ అప్పజెప్పకూడదని అనుకుంటున్నా..’ అని కనేరియా తెలిపాడు. కాగా, రోహిత్ శర్మ ఐదో టెస్టుకు కోలుకుంటాడని అంతా ఆశిస్తున్నారు. అతడు అందుబాటులో లేకుంటే మాత్రం బుమ్రా కే  సారథ్య పగ్గాలు అప్పజెప్పే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.  

click me!