మంచిరోజులు వచ్చాయి, విరాట్ లాస్ట్ సెంచరీ ఎప్పుడు కొట్టాడో గుర్తు లేదు కానీ... - వీరేంద్ర సెహ్వాగ్

First Published Jun 27, 2022, 2:11 PM IST

దాదాపు మూడేళ్లుగా సెంచరీ మార్కు అందుకోవడంలో విఫలమవుతున్నాడు కానీ విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి పరుగుల ప్రవాహం మాత్రం ఎప్పుడూ ఆగింది లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌‌లో 300+ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, లీస్టర్‌షైర్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

లీస్టర్‌షైర్‌తో జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 69 బంతులాడి 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ... రెండో ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 98 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 100 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో తన స్టైల్‌లో 68.37 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి బ్యాక్ టు ది ఫామ్ అనిపించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ ధారాళంగా పరుగులు చేస్తాడనే నమ్మకం వచ్చిందని అంటున్నాడు బారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

సోనీ నెట్‌వర్క్‌లో ‘ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరేంద్ర సెహ్వాగ్... ‘విరాట్ కోహ్లీ చివరిసారిగా సెంచరీ ఎప్పుడు చేశాడో మీకు గుర్తుందా? నాకు కూడా గుర్తు లేదు...

అయితే ఈసారి సిరీస్ డిసైడర్‌లో ఎడ్బస్టన్ టెస్టులో విరాట్ కోహ్లీ భారీ స్కోరు చేస్తాడని నాకు అనిపిస్తోంది. అతని చెడ్డ రోజులన్నీ పోయాయి. ఇక్కడితో ముగిసిపోయాయి. ఇప్పటికే మంచి రోజులు మొదలైపోయాయి...

వార్మప్ మ్యాచ్‌లో అతను ఓ హాఫ్ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అమూల్యమైన 33 పరుగులు చేశాడు... ఈ మ్యాచ్‌‌లో విరాట్ బ్యాటింగ్ చూస్తుంటే అతను పూర్తి ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు...

చివరిసారిగా 2019లో వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, 2021 ఇంగ్లాండ్ టూర్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో 31.14 సగటుతో 218 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.   

click me!