పంత్‌కు గాయం.. మరి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు వికెట్ కీపర్ ఎవరు..? సెలక్షన్ కమిటీ ముందు మూడు ఆప్షన్లు

First Published Jan 1, 2023, 2:32 PM IST

Rishabh Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడటంతో భారత జట్టుకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.  పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అతడిని భర్తీ చేసే ఆటగాడు దొరికినా  టెస్టులలో మాత్రం... 

రోడ్డు ప్రమాదంలో గాయపడి  ప్రస్తుతం డెహ్రాడూన్ లో చికిత్స పొందుతున్న రిషభ్ పంత్  తిరిగి  కోలుకుని  సాధారణ  స్థితికి రావడానికి చాలాకాలం పట్టొచ్చు.   అతడు  కోలుకోవడానికి సుమారు 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో   పంత్ వచ్చే నెలలో స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు ఐపీఎల్, తర్వాత సిరీస్ లు కూడా మిస్ కానున్నాడు.  

మరి పంత్ దూరమైతే  ఆస్ట్రేలియాతో టెస్టులలో భారత్ కు వికెట్ కీపర్ గా ఉండేది ఎవరు..? అన్న  ప్రశ్న తలెత్తుతున్నది.  దీంతో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత  సెలక్టర్ల మీద పడింది.  చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ  రద్దైన నేపథ్యంలో కొత్తగా నియమించబోయే  సెలక్షన్ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 
 

అయితే  పంత్ కు స్టాండ్ బై గా గతేడాది నుంచి  ఆంధ్ర కుర్రాడు కోన శ్రీకర్ భరత్ ను  టీమ్ మేనేజ్మెంట్ ఆడిస్తున్నది.  పంత్ గాయపడ్డ సందర్భాల్లో అతడు వచ్చి  వికెట్ కీపింగ్ చేశాడు. కానీ అధికారికంగా ఇంకా టెస్టులలో అరంగేట్రం చేయలేదు.  సాంకేతికంగా చూస్తే  పంత్ లేకుంటే భరత్ కు ఆ ఛాన్స్ దక్కాల్సిందే. 

కానీ ఈ స్థానం కోసం  ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలుస్తున్నది.  భరత్ తో పాటు ఇండియా ఏ వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్,  పరిమిత ఓవర్లలో భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్ ల  మధ్య తీవ్రమైన పోటీ ఉంది.  ఇద్దరు స్పెషలిస్టు వికెట్ కీపర్ బ్యాటర్లతో బరిలోకి దిగితే భరత్, ఉపేంద్ర లకు ఛాన్స్ దక్కొచ్చు. లేదంటే  ఓపెనర్ గా రాణిస్తున్న ఇషాన్ కూ అవకాశమివ్వొచ్చని సమాచారం. 

భరత్, ఉపేంద్రలు మాత్రమే టెస్టు సిరీస్ కు ఎంపికైతే వారిలో  తుది జట్టులో ఉండేది ఎవరు..? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సాంకేతికంగా భరత్ కు అవకాశం దక్కాల్సి ఉన్నా.. బ్యాటింగ్ పరంగా  ఉపేంద్ర అతడి కంటే  బెటర్ గా ఉన్నాడు. వికెట్ కీపింగ్ నైపుణ్యంతో పాటు  బ్యాటింగ్ లో 45 ప్లస్ సగటుతో  దూసుకుపోతున్నాడు.   అదీగాక ఉపేంద్ర మంచి హిట్టర్ కూడా.  
 

ఇక ఇషాన్ కిషన్ ఇటీవలే బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.  ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ లో కూడా జార్ఖండ్ తరఫున ఆడుతూ  ఫామ్ చాటుకుంటున్నాడు. భరత్, ఉపేంద్రలతో పాటు ఇషాన్ కూడా సెలక్టర్లకు ఉన్న ఆప్షన్. 
 

ఒకవేళ మరో బౌలర్ లేదా బ్యాటర్ ను తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తే మాత్రం కెఎల్ రాహుల్ వికెట్ల వెనుక నిల్చోక తప్పదు.  అతడికి బ్యాకప్ గా భరత్, ఉపేంద్రలలో ఎవరినో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలూ లేకపోలేదని బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.  మరి కొత్తగా వచ్చే సెలక్టర్లు  ఏ నిర్ణయం తీసుకుంటారోనని  ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

click me!