రిషభ్‌కూ ఓ కుటుంబం ఉంది.. ఇలాగేనా మీరు చేసేది.. ఫ్యాన్స్‌పై రోహిత్ భార్య, దినేశ్ కార్తీక్ ఆగ్రహం

First Published Jan 1, 2023, 12:41 PM IST

Rishabh Pant Car Accident: గాయపడిన రిషభ్ పంత్ ఫోటోలను సోషల్ మీడియా పంచుకోవడంపై టీమిండియా సారథి రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేతో పాటు వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్  ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్  కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.  అయితే సోషల్ మీడియా వేదికగా పలువురు ఇందుకు సంబంధించిన ఫోటోలను పంచుకోవడంపై టీమిండియా సారథి రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేతో పాటు వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్  ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.   రిషభ్ కూ ఓ కుటుంబం ఉందని..   బాధితుల వ్యక్తుల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం సంస్కారం కాదని రితికా మండిపడింది. 

శుక్రవారం తెల్లవారుజామున  రూర్కీ వెళ్తుండగా  పంత్ కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి మంటలు చెలరేగాయి.  పంత్ కు నుదుటితో పాటు మోకాలు, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. పంత్  ముఖంపై చిన్న ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు.  అయితే ఈ ప్రమాదం తర్వాత పంత్ ఆస్పత్రిలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇదే విషయమై రోహిత్ భార్య రితికా ఇన్‌స్టాగ్రామ్ లో  స్పందిస్తూ.. ‘రిషభ్ కారు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు  పోస్టు చేసిన వారిని చూస్తే సిగ్గుగా ఉంది.  ఎవరైనా బాధలో ఉన్నప్పుడు  ఇలాంటివి వారికి కావాలా..? వద్దా...? అని నిర్ణయించుకోలేరు. బాధితుల ఫోటోలను అలా చూస్తే వారి కుటుంబాలు ఎంతో మనోవేధనకు గురవుతాయి. కనీస జ్ఞానం లేకుండా ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటు..’ అని  పోస్టు చేసింది. 

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పంత్ కు కారు ప్రమాదం అయిందని తెలియగానే అతడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన కార్తీక్.. దాని కొనసాగింపులో.. ‘మీ అందరికీ  నా ప్రత్యేక విన్నపం ఏంటంటే..  దయచేసి ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేయకండి.  పంత్ కు, అతడి కుటుంబానికి  కొంత ప్రైవసీ ఇవ్వండి. కొంచెం మానవత్వం చూపండి..’ అని కోరాడు. 

శ్రీలంకతో  టీ20, వన్డే సిరీస్ కు దూరమైన పంత్..  తన తల్లిని సర్‌ప్రైజ్ చేయడానికి ఢిల్లీ నుంచి  ఉత్తరాఖండ్ కు వెళ్తుండగా  రూర్కీ సమీపంలో అతడి కారు ఢీకొట్టిన విషయం తెలిసిందే.  దీంతో పంత్ ను హుటాహుటిన  రిషికేష్ లోని ఎయిమ్స్ కు తరలించారు. 

శనివారం పంత్ కు ప్లాస్టిక్  సర్జరీ చేసినట్టు  ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ తెలిపారు.  శ్యామ్ మాట్లాడుతూ.. ‘డీడీసీఏ నుంచి  ఓ బృందం డెహ్రాడూన్ కు వెళ్లింది. అక్కడ పంత్ ఆరోగ్యాన్ని పరిశీలించింది.   ప్లాస్టిక్ సర్జరీ అవసరమని భావించడంతో మేం ముందుగా అతడిని ఢిల్లీకి షిఫ్ట్ చేయాలని  అనుకున్నాం. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా   పంత్ ను  ఢిల్లీకి  తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం.. 

కానీ  వైద్యులు  డెహ్రాడూన్ లోనే పంత్ కు  ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. దీంతో మేం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం.  ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం  బాగానే ఉంది.. ఎంఆర్ఐ స్కానింగ్ లో కూడా ఎలాంటి సమస్యా లేదని  తేలింది’ అని  చెప్పారు. 

click me!