తన తల్లిని సర్‌ప్రైజ్ చేయడానికని ఇంటికి వెళ్తూ కారు డివైడర్ కు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరోగ్యానికి సంబంధించి కీలక అప్టేడ్ వెలువడింది. రిషభ్ కు డెహ్రాడూన్ లో వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు తెలుస్తున్నది. ప్రమాదంలో పంత్ ముఖానికి పలు గాయాలయ్యాయి.
Rishabh Pant accident
ఈ నేపథ్యంలో ఆ గాయాలకు చిన్న ప్లాస్టిక్ సర్జరీ అవసరం వచ్చిందని.. దానిని డెహ్రాడూన్ లోనే పూర్తి చేసినట్టు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ తెలిపారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో అతడికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు తెలుస్తున్నది.
ఇదే విషయమై డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ మాట్లాడుతూ.. ‘డీడీసీఏ నుంచి ఓ బృందం డెహ్రాడూన్ కు వెళ్లింది. అక్కడ పంత్ ఆరోగ్యాన్ని పరిశీలించింది. ప్లాస్టిక్ సర్జరీ అవసరమని భావించడంతో మేం ముందుగా అతడిని ఢిల్లీకి షిఫ్ట్ చేయాలని అనుకున్నాం. అవసరమైతే విమానం (ఎయిర్ అంబులెన్స్) ద్వారా పంత్ ను ఢిల్లీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం..
కానీ వైద్యులు డెహ్రాడూన్ లోనే పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. దీంతో మేం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉంది.. ఎంఆర్ఐ స్కానింగ్ లో కూడా ఎలాంటి సమస్యా లేదని తేలింది’ అని చెప్పారు.
ప్రస్తుతం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో పంత్ చికిత్స జరుగుతోంది. అతడి చికిత్సకు అయ్యే ఖర్చును బీసీసీఐ భరిస్తోంది. పంత్ బీసీసీఐతో కాంట్రాక్టు ఉన్న క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. అతడి ఆరోగ్యంపై బీసీసీఐ నిత్యం వైద్యులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది.
ఇదిలాఉండగా ప్రమాదానికి గురైన పంత్ తల్లితో మాట్లాడిన ప్రధాని మోడీకి బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. పంత్ కుటుంబానికి అండగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు అని ట్వీట్ లో రాసుకొచ్చింది. పంత్ కు అత్యుత్తమ చికిత్స అందించేందుకు గాను ఢిల్లీకి గానీ లేదంటే ముంబైకి గానీ తరలించడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నది.