Rishabh Pant: రిషభ్ పంత్‌కు బిగ్ షాక్.. లక్నో కెప్టెన్సీ నుంచి ఔట్.. ఏం జరుగుతోంది?

Published : May 24, 2026, 12:07 PM IST

Rishabh Pant: ఐపీఎల్ 2026లో లక్నో ఘోర పరాజయం తర్వాత రిషభ్ పంత్ కెప్టెన్సీ ప్రమాదంలో పడింది. నాయకత్వ మార్పుపై ఎల్‌ఎస్‌జీ డైరెక్టర్ టామ్ మూడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ అయిన పంత్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

PREV
16
ఐపీఎల్ 2026లో లక్నో ఘోర పరాజయం: పంత్ కు షాక్

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) కథ అత్యంత దారుణంగా ముగిసింది. శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిపాలైంది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ అందరికంటే చివరన, అంటే 10వ స్థానంలో నిలిచి టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది.

ఈ అవమానకరమైన ప్రదర్శన తర్వాత లక్నో ఫ్రాంచైజీలో తీవ్ర కలకలం మొదలైంది. ముఖ్యంగా టీమ్ కెప్టెన్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ధరకు అమ్ముడైన రిషభ్ పంత్ కెప్టెన్సీ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. లక్నో సూపర్ జెయింట్స్ గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ చేసిన తాజా వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. వచ్చే సీజన్ నాటికి లక్నో టీమ్ మేనేజ్‌మెంట్ లీడర్‌షిప్‌ను పూర్తిగా మార్చాలని, అంటే కెప్టెన్‌ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

26
ఐపీఎల్ 2026 లో లాస్ట్ ప్లేస్ లో లక్నో

ఐపీఎల్ 2026 సీజన్ లక్నో జట్టుకు ఒక పీడకలలా నిలిచింది. టోర్నీని ఓటమితో ప్రారంభించిన ఈ జట్టు, చివరకు ఓటమితోనే ముగించింది. ఈ మొత్తం సీజన్‌లో లక్నో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించి, ఏకంగా 10 మ్యాచ్‌లలో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లక్నోకు అత్యంత కీలకం అయినప్పటికీ, అందులోనూ ఘోరంగా విఫలమైంది.

మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన టామ్ మూడీ, జట్టు భవిష్యత్తుపై, నాయకత్వ మార్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లీడర్‌షిప్ పొజిషన్‌తో సహా అన్ని ఆప్షన్లను తాము పునఃసమీక్షిస్తామని ఆయన బాంబు పేల్చారు. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి రిషభ్ పంత్ చేతి నుంచి లక్నో కెప్టెన్సీ చేతులు మారడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది.

36
₹27 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో: అటు బ్యాటింగ్‌లో.. ఇటు కెప్టెన్సీలో ఫెయిల్

ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రికార్డు స్థాయి ధరను వెచ్చించి రిషభ్ పంత్‌ను సొంతం చేసుకుంది. ఏకంగా ₹27 కోట్లు పెట్టి పంత్‌ను కొనుగోలు చేయడమే కాకుండా, జట్టును ముందుండి నడిపిస్తాడని కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఆటగాడికి లభించిన అత్యధిక ధర ఇది. అయితే, ఈ ₹27 కోట్ల భారీ పెట్టుబడి పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరైంది.

లక్నో నమ్మకాన్ని పంత్ పూర్తిగా వమ్ము చేశాడు. అటు కెప్టెన్‌గా సరైన నిర్ణయాలు తీసుకోలేక, ఇటు బ్యాటర్‌గా జట్టును ఆదుకోలేక పంత్ చేతులెత్తేశాడు. ఈ సీజన్‌లో పంత్ ప్రదర్శన చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 13 ఇన్నింగ్స్‌లలో పంత్ కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని యావరేజ్ 28.36 కాగా, స్ట్రైక్ రేట్ 138.05 మాత్రమే. ఈ సీజన్ మొత్తంలో పంత్ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు.

46
దెబ్బకొట్టిన పంత్ నిర్ణయాలు

పంత్ కెరీర్ రికార్డులతో పోలిస్తే ఈ సీజన్ గణాంకాలు చాలా దారుణంగా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన వర్చువల్ నాకౌట్ మ్యాచ్‌లో కూడా పంత్ బాధ్యతారాహిత్యంగా ఆడాడు. అత్యంత నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ 21 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. టీమ్‌లో నికోలస్ పూరన్ వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ, పంత్ తీసుకున్న నిర్ణయాల వల్ల జట్టు భారీ నష్టాన్ని చవిచూసింది. 

సీజన్ మొత్తంగా ప్లేయింగ్ ఎలెవన్, బ్యాటింగ్ ఆర్డర్‌లో లక్నో మేనేజ్‌మెంట్ నిరంతరం మార్పులు చేస్తూనే వచ్చింది. దీనివల్ల జట్టుకు ఒక స్థిరమైన రూపం లేకుండా పోయింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన లక్నో ఫ్రాంచైజీ, పంత్ పేలవమైన ఫామ్, కెప్టెన్సీ వైఫల్యాల వల్ల పాయింట్ల పట్టికలో అడుగున నిలవాల్సి వచ్చింది.

56
రీసెట్' అవసరం: లీడర్‌షిప్‌పై సీరియస్ రివ్యూ చేయనున్నట్లు టామ్ వెల్లడి

పంజాబ్ కింగ్స్ చేతిలో 10వ ఓటమిని చవిచూసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చాలా సీరియస్‌గా మాట్లాడారు. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, లీడర్‌షిప్ మార్పుపై స్పష్టమైన హింట్ ఇచ్చారు.

"ఈ సీజన్ మాకు చాలా కష్టతరంగా సాగిందనే విషయం నాకు తెలుసు. మేము దీనిపై కచ్చితంగా సమీక్ష జరుపుతాము. తగినంత సమయం తీసుకుని, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాము. చెప్పాలంటే, మేము మా కోసం నిర్దేశించుకున్న అంచనాలను లేదా ప్రమాణాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాము. ఫ్రాంచైజీ లీడర్‌షిప్ విషయానికి వస్తే, భవిష్యత్తులో ఇది ఎలా ఉండాలనే దానిపై మేము చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాము" అని మూడీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మేము ఒక రీసెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోందని అన్నారు.

66
టీమిండియాలోనూ ఇదే సీన్: రిషభ్ పంత్ భవిష్యత్తు ఏంటి?

రిషభ్ పంత్ ప్రదర్శనపై కేవలం టామ్ మూడీ మాత్రమే కాదు, లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా గతంలోనే తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పంత్ కెప్టెన్సీ, బ్యాటింగ్ గురించి అడిగిన ప్రశ్నకు లాంగర్ సూటిగా సమాధానమిచ్చారు.

"రిషభ్ పంత్ చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. అతను 18 ఏళ్ల వయసు నుంచే భారత జట్టు తరఫున ఆడుతున్నాడు. అతనికి ఆటపై పూర్తి అవగాహన ఉంది. కానీ, నెంబర్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. బ్యాటర్‌గా గత రెండు సీజన్లు అతనికి తీవ్ర నిరాశను మిగిల్చాయని అతనే స్వయంగా అంగీకరిస్తాడు" అని లాంగర్ వ్యాఖ్యానించారు.

జస్టిన్ లాంగర్ ఇంకా మాట్లాడుతూ.. పంత్ గతంలో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, ఈ రెండు సీజన్లలోని అతని గణాంకాలు అతడిని సైతం నిరాశకు గురిచేస్తాయని అన్నారు. "మీ జట్టులోని సీనియర్ ఆటగాళ్ల నుంచి మీరు ఎప్పుడూ ఎక్కువ ఆశిస్తారు. జట్టులో ఉన్న మిగతా అందరిలాగే పంత్ కూడా ఈ వైఫల్యాన్ని తీవ్రంగా అనుభవిస్తూ ఉంటాడు" అని లాంగర్ పేర్కొన్నారు.

టీమిండియా నుంచి పంత్ అవుట్

ప్రస్తుతం 28 ఏళ్ల వయసులో ఉన్న రిషభ్ పంత్, ఒక అథ్లెట్‌గా తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండాలి. కానీ, అతని క్రికెట్ కెరీర్ గ్రాఫ్ మాత్రం దానికి భిన్నంగా కిందికి పడిపోతోంది. ఐపీఎల్‌లోనే కాకుండా టీమిండియాలోనూ పంత్ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన హోమ్ సిరీస్ కోసం భారత వైట్-బాల్ జట్టు నుంచి పంత్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు.

భారత జట్టు యాజమాన్యం కూడా పంత్‌ను పక్కన పెట్టి ముందుకు సాగాలని చూస్తోందనడానికి ఇది ఒక పెద్ద సంకేతం. ఈ నిరాశాజనకమైన సీన్ టెస్ట్ జట్టులోనూ కొనసాగింది. టెస్ట్ ఫార్మాట్‌లో పంత్ చేతిలో ఉన్న వైస్-కెప్టెన్సీ బాధ్యతలను సెలక్టర్లు కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. 2025 సీజన్ కంటే ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహులే కెప్టెన్‌గా వ్యవహరించడం గమనార్హం.

ఈ పరిస్థితుల నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్‌లో పంత్ భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories