ఎవరీ కుర్రాడు..? అతడిలో టాలెంట్ పుష్కలంగా ఉంది.. టీమిండియా యంగ్ క్రికెటర్ పై పాంటింగ్ ప్రశంసలు

First Published Nov 18, 2021, 5:03 PM IST

Vekatesh Iyer: ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రెండో దశలో  కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన వెంకటేష్ అయ్యర్.. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

న్యూజిలాండ్ తో నిన్న జరిగిన తొలి టీ20 లో టీమిండియా తరఫున ఐపీఎల్ అదరగొట్టిన వెంకటేష్ అయ్యర్ అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే.  భారత జట్టుకు ఎంపిక కాకముందు ఈ యంగ్ ఆల్ రౌండర్.. కోల్కతా  నైట్ రైడర్స్ తో పాటు మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. 

అయితే ఇటీవలే ముగిసిన  ఐపీఎల్ లో తన ప్రతిభ నిరూపించుకున్న అయ్యర్.. టీమిండియాతో చేరాడు. నిన్నటి మ్యాచ్ లో అతడితో బౌలింగ్ చేయించకున్నా..  చివర్లో బ్యాటింగ్ దక్కినా ఒక్క ఫోర్ కొట్టి వెనుదిరిగాడు. ఉత్కంఠ  రేపిన మ్యాచ్ లో  అయ్యర్ గెలిపించి ఉంటే బావుండేదనే అభిప్రాయాలు వెలువడ్డాయి. 

ఆల్ రౌండర్ గా ఎదిగిన  అయ్యర్ గురించి ఆస్ట్రేలియా మాజీ  సారథి రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తొలిసారి అయ్యర్ ను చూసినప్పుడు అతడి  బ్యాటింగ్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయాయని చెప్పుకొచ్చాడు. 

ఇదే విషయమై పాంటింగ్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్-14 సీజన్ లో తొలి దశలో అయ్యర్ కు పెద్దగా అవకాశాలు రాలేదు.  కానీ రెండో దశలో మాత్రం ఆ జట్టు అతడిని  బాగా ఉపయోగించుకుంది.

ఐపీఎల్ తొలి దశలో భాగంగా కోల్కతా ఓ సారి మాతో (పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్) మ్యాచ్ కు ముందు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ కుర్రాన్ని చూడగానే నాకు ముచ్చటేసింది. చాలా బాగా ఆడుతున్నాడు. అతడిలో టాలెంట్ పుష్కలంగా ఉంది.

నేను అదే సమయంలో అక్కడ ఉన్న కోల్కతా కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్  ఈ అబ్బాయి ఎవరని అడిగాను.. కోల్కతా తరఫున అతడు  ఆడటం లేదా..? అని ఆరా తీశాను. దానికి మెక్ కల్లమ్ సమాధానం చెబుతూ.. లేదు, అతడు (అయ్యర్) ఆడటం లేదని చెప్పాడు.

కానీ రెండో దశలో కోల్కతా కథ మారింది.  అప్పుడు బ్రెండన్ మార్కు స్పష్టంగా కనిపించింది.  ఐపీఎల్ రెండో దశలో ఆ జట్టు వెంకటేష్ ను ఓపెనర్ గా  ప్రమోట్ చేసింది..’ అని పాంటింగ్ అన్నాడు. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రెండో దశలో ఆడిన అయ్యర్.. 370 పరుగులతో చెలరేగాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో రాణించడంతో అతడికి భారత జట్టులో స్థానం దక్కింది. 

కాగా..  టీమిండియా హెడ్ కోచ్ గా కూడా తనకు ఆఫర్  వచ్చిందని రికీ పాంటింగ్ అన్నాడు. ఆ మాట నిజమేనని, కానీ కొన్ని కారణాల వల్ల  తాను ఆ పదవిని స్వీకరించలేకపోయానని చెప్పాడు. ‘ఐపీఎల్ తో పాటు నా కుటుంబాన్ని వదిలి నేను టీమిండియాతోనే గడపాల్సి ఉంటుంది.  అది నాకు చాలా కష్టమనిపించింది. అందుకే ఆ పదవిని నేను వదులుకున్నా...’ అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. 

click me!