టీమిండియా కోచ్‌గా రమ్మని పిలిచారు, కానీ ఆ కారణంగానే ఒప్పుకోలేదు... ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

First Published Nov 18, 2021, 4:17 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో టీమిండియా హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఆయన తర్వాత ఆ పొజిషన్‌లో ఎవరు వస్తారనే విషయంలో సస్పెన్స్ రేగింది. అయితే ఉత్కంఠకి తెరదించుతూ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌ని భారత హెడ్‌కోచ్‌గా నియమించింది బీసీసీఐ.

రాహుల్ ద్రావిడ్ నియామకానికి ముందు భారత హెడ్ కోచ్ రేసులో ఉన్నారంటూ వినిపించిన పేర్లలో ఆస్ట్రేలియా మాజీ సారథి, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ రికీ పాంటింగ్ ఒకరు..

ఆస్ట్రేలియాకి అద్భుత విజయాలు అందించి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా ఉన్న రికీ పాంటింగ్‌... భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉండేందుకు తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనంటూ నిర్ధారించాడు...

‘ఐపీఎల్ 2021 సమయంలోనే భారత హెడ్‌కోచ్‌గా ఉండాల్సిందిగా నాకు ఆఫర్ వచ్చింది. కొందరు బీసీసీఐ అధికారులు నాతో ఈ విషయం గురించి మాట్లాడారు...

నన్ను ఎలాగైనా ఒప్పించడానికి ఎంత మొత్తం చెల్లించడానికైనా సిద్ధమన్నారు. వారి ప్రయత్నాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. అయితే నేను కొన్ని కారణాల వల్ల అంగీకరించలేకపోయాను...

మొదటిది నాకు తగిన సమయం లేదు. అదీకాకుండా టీమిండియా కోచ్‌గా ఉండేందుకు అంగీకరిస్తే, ఐపీఎల్‌లో కోచ్‌గా కొనసాగలేను... అదీకాకుండా నా కుటుంబ బాధ్యతలు కూడా ఓ కారణం...

మా పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. వారితో సరిపడా సమయం గడపాలని అనుకున్నా. భారత జట్టు కోచ్‌గా ఉంటే, ఆ అవకాశం దక్కదు. దేశానికి దూరంగా ఉండాల్సి వస్తుంది...

అదీకాకుండా టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉండడమనేది చాలా పెద్ద పని. ఏదో సమ్మర్‌లో ఓ మూడు నెలలు ఐపీఎల్ టీమ్‌లకు పనిచేయడమంటే ఓకే కానీ, ఏడాదంతా బిజీగా గడపడమంటే ఇప్పుడు నా వల్ల కాదు..

టీమిండియా హెడ్ కోచ్ పదవిని రాహుల్ ద్రావిడ్ స్వీకరించడని తెలిసి ఆశ్చర్యపోయా. అండర్19 కోచ్‌గా ఉన్న సమయంలో రాహుల్ ద్రావిడ్‌తో చాలా సేపు మాట్లాడాను...

అతను ఆ పొజిషన్‌ను బాగా ఇష్టపడ్డాడు. కుటుంబంతో కలిసి గడిపేందుకు సమయం దొరుకుతోందని సంతోషించాడు. ఇప్పుడు ఆ రెండూ అతనికి దూరం కావాల్సిందే...

టీమిండియాకి హెడ్ కోచ్‌గా ఉంటే అతను వ్యక్తిగత జీవితానికి దూరంగా గడపాల్సి ఉంటుంది. ద్రావిడ్ పిల్లలు కూడా చిన్నవాళ్లే. అతన్ని ఎలా దీనికి ఒప్పించారనేది తేలియడం లేదు...

అయితే టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కరెక్ట్ అని చాలా మంది అనుకుంటున్నారు. బీసీసీఐలో కొందరు వ్యక్తులు కూడా నాతో ఇదే మాట అన్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు రికీ పాంటింగ్...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకి మెంటర్‌గా వ్యవహరించిన రికీ పాంటింగ్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కి మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు...

రికీ పాంటింగ్ శిక్షణలో శిఖర్ ధావన్, పృథ్వీషా, రిషబ్ పంత్, ఆవేశ్ ఖాన్ వంటి ప్లేయర్లు అదరగొడుతున్నారు. గత ఏడాది తొలిసారిగా ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈసారి టేబుల్ టాపర్‌గా నిలిచినా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 

click me!