IPL 2025 RCB vs RR: ఐపీఎల్ 2025 42వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. దాదాపు రాజస్థాన్ గెలుపు ఖాయం అయిన మ్యాచ్ లో కీలక సమయంలో వికెట్లు కోల్పోయి రియాన్ పరాగ్ టీమ్ మ్యాచ్ ను కోల్పోయింది. ముందు బ్యాటింగ్ లో, ఆ తర్వాత కీలక సమయంలో సూపర్ బౌలింగ్ తో వికెట్లు పడగొట్టి ఆర్సీబీ 11 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.
ఐపీఎల్ 2025 42వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి ఆరో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్2025లో తమ హోం గ్రౌండ్ లో ఆర్సీబీ తమ తొలి విజయాన్నినమోదుచేసింది.
ఈ సీజన్‌లో చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుకు ఇది తొలి విజయం. మరోవైపు, రాజస్థాన్ వరుసగా 5 మ్యాచ్ లలో ఓడిపోయింది. చివరి ఓవర్లలో జోష్ హాజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు పడగొట్టి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ 194 పరుగులు మాత్రమే చేయగలిగారు.
మ్యాచ్‌ను మలుపు తిప్పిన జోష్ హాజిల్‌వుడ్
ఆర్సీబీ ఉంచిన భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్ వరకు పట్టుబిగించింది. మ్యాచ్‌లో బలమైన జట్టుగా కనిపించింది. కానీ చివరి ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా వరుసగా వికెట్లు జారవిడుచుకుని మ్యాచ్ ను కోల్పోయింది.
ముఖ్యంగా జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్‌లోని 19వ ఓవర్ మ్యాచ్‌లో నిర్ణయాత్మకంగా నిలిచింది. ఆ ఓవర్‌లో జోష్ హాజిల్‌వుడ్ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి ధ్రువ్ జురెల్ (47) పెద్ద వికెట్‌తో సహా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
యశస్వి జైస్వాల్ తుఫాను ఇన్నింగ్స్ వృధా
యశస్వి జైస్వాల్ తుఫాను ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ కు గొప్ప ఆరంభాన్ని అందించాడు, కానీ మిడిల్ ఆర్డర్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. యశస్వి 19 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. నితీష్ రాణా (28), రియాన్ పరాగ్ (22), సిమ్రాన్ హెట్మెయర్ (11) భారీ స్కోర్లు చేయలేకపోయారు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 16 పరుగులు చేసి ఔటయ్యాడు.
బెంగళూరులో కోహ్లి-పడిక్కల్ సూపర్ షో
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200 పరుగుల మార్కును దాటడంలో విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించారు. కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు సాధించగా, పాడిక్కల్ కూడా వేగంగా బ్యాటింగ్ చేసి కేవలం 27 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. పాడిక్కల్ 185 స్ట్రైక్ రేట్‌తో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
చివరలో టిమ్ డేవిడ్ 23 పరుగులు, జితేష్ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు సాధించారు. రాజస్థాన్ తరఫున సందీప్ శర్మ 2 వికెట్లు తీసిన అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు. జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగా తలా ఒక వికెట్ తీసుకున్నారు.