Virat Kohli. (Photo- IPL)
IPL 2025 Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025 అదరగొడుతున్నాడు. అద్భుతంగా ఆడుతూ వరుస హాఫ్ సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ 2025లో 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.
ఈ సీజన్ లో 42వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 70 పరుగులు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో కింగ్ కోహ్లీ మరో రికార్డును సాధించాడు. ప్రపంచ క్రికెట్ లో ఈ రికార్డు సాధించిన మొదటి బ్యాట్స్‌మన్ అయ్యాడు.
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగుల తన తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఫిల్ సాల్ట్ తో కలిసి ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ మొదటి రెండు ఓవర్లలో ప్రశాంతంగా కనిపించాడు, కానీ ఆ తర్వాత తన దూకుడు శైలిని ప్రదర్శించి పరుగుల వర్షం కురిపించాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. విరాట్ 166 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.
విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో టీ20 క్రికెట్‌లో తన 3500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో ఒకే వేదికపై 3500 పరుగుల మార్కును తాకిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
Virat Kohli
కోహ్లీ కంటే ముందు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. విరాట్ కోహ్లీ తర్వాత, బంగ్లాదేశ్‌కు చెందిన ముష్ఫికర్ రహీమ్ మీర్పూర్‌లో 3373 పరుగులతో ఒకే వేదికపై T20లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు.
అలాగే, టీ20ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ 62 సార్లు 50+ పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్, ఫాఫ్ డు ప్లెసిస్ టాప్-5లో ఉన్నారు.
Virat Kohli
టీ20లో మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు
62 – విరాట్ కోహ్లీ
61 – బాబర్ ఆజం
57 - క్రిస్ గేల్
55 - డేవిడ్ వార్నర్
52 - జోస్ బట్లర్
52 - ఫాఫ్ డు ప్లెసిస్
Virat Kohli
ఐపీఎల్ లో 2025లో ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ
రాజస్థాన్‌పై 70 పరుగుల ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ 417 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కలిగి ఉన్నాడు. విరాట్ కోహ్లీ 5 అర్ధ సెంచరీలతో 392 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ ఇప్పటివరకు 377 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (373 పరుగులు), జోస్ బట్లర్ (356 పరుగులు) వరుసగా నాలుగు, ఐదో స్థానంలో ఉన్నారు.