RCB vs KKR Eliminator: ఆర్‌సీబీ మళ్లీ అదే తీరు... సునీల్ నరైన్ మ్యాజిక్‌తో కేకేఆర్ ముందు...

First Published Oct 11, 2021, 9:10 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌‌లో ఆర్‌సీబీ కథ మారనట్టే కనిపిస్తోంది. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ మూకమ్మడిగా ఫెయిల్ అయ్యారు... కేకేఆర్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేయగలిగింది...

ఆర్‌సీబీ ఓపెనర్లు శుభారంభం అందించారు. 5 ఓవర్లలో 49 పరుగులు జోడించి భారీ స్కోరుపై ఆశలు రేపారు. అయితే 18 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్‌ను లూకీ ఫర్గూసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు...

గత మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ 16 బంతులాడి కేవలం 9 పరుగులు చేసి, సునీల్ నరైన్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

33 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని సునీల్ నరైన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఆదుకుంటాడని భావించిన ఏబీ డివిల్లియర్స్ కూడా 9 బంతుల్లో 11 పరుగులు చేసి నరైన్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు...

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌ను ఒకే మ్యాచ్‌లో క్లీన్‌బౌల్డ్ చేసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సునీల్ నరైన్... ఇంతకుముందు త్రివేది, నెహ్రా ఈ ఇద్దరినీ ఒకే ఇన్నింగ్స్‌లో అవుట్ చేసినా, బౌల్డ్ చేయలేకపోయారు...

ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన సునీల్ నరైన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మూడో సారి ఈ ఫీట్ నమోదుచేశాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గానూ నిలిచాడు నరైన్...

ఆ తర్వాత 18 బంతుల్లో 15 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా సునీల్ నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...

షాబాజ్ అహ్మద్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసి లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 9 పరుగులు చేసిన డాన్ క్రిస్టియన్ ఆఖరి ఓవర్‌లో రనౌట్ అయ్యాడు. హర్షల్ పటేల్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

click me!