IPL Retention: ధోని తర్వాత సీఎస్కే కెప్టెన్ అతడే.. ఆ విషయం అతడికీ తెలుసు.. రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు

First Published Dec 1, 2021, 3:07 PM IST

Dhoni-Jadeja: మంగళవారం ముగిసిన ఐపీఎల్ రిటైన్డ్  ప్లేయర్ల జాబితాలో చెన్నై.. ఎంఎస్ ధోనిని తిరిగి దక్కించుకుంది. అయితే ధోనికి  రెండో ప్రాధాన్యమిచ్చింది.  దీంతో ఈ సీజన్ లోనే ధోని చెన్నై కెప్టెన్సీ పగ్గాలను వదిలేయడం ఖాయమని చెప్పకనే చెప్పారు. 

ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని.. త్వరలోనే ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పనున్నాడు.  అయితే అది వచ్చే సీజన్ లోనే అనే వాదనలు వినిపిస్తున్నాయి. 

తాజాగా  మంగళవారం ముగిసిన ఐపీఎల్ రిటైన్డ్  ప్లేయర్ల జాబితాలో చెన్నై.. ఎంఎస్ ధోనిని తిరిగి దక్కించుకుంది. అయితే రెండో ప్రాధాన్య ఆటగాడిగా మార్చుకుంది. తొలి ప్రాధాన్యం ఆ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు దక్కింది. 

చెన్నై సూపర్ కింగ్స్.. ధోనిని రూ. 12 కోట్లు పెట్టి నిలుపుకోగా, జడ్డూకు రూ. 16 కోట్లు ముట్టజెప్పింది. మోయిన్ అలీ కి రూ. 8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ కు రూ. 6 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది. 

ఇటీవలే ఓ అవార్డు ఫంక్షన్ లో ధోని  మాట్లాడుతూ.. తన చివరి మ్యాచ్ చెన్నైలోనే ఆడతానని చెప్పిన విషయం తెలిసిందే.  వచ్చే ఏడాది ఏప్రిల్ లో చెన్నైలోనే తొలి మ్యాచ్ జరుగనున్నది. ముంబై ఇండియన్స్ తో జరుగబోయే ఆ మ్యాచ్  లోనే ధోని నిష్క్రమిస్తాడా...? లేదా సీజన్ అంతా కొనసాగుతాడా..? అనే దానిపై స్పష్టత లేదు. 

అయితే ఒకవేళ ధోని ఎప్పుడు తప్పుకున్నా ఆ స్థానాన్ని భర్తీ చేసేది మాత్రం రవీంద్ర జడేజానే అనే వాదనలు వినిపిస్తున్నాయి. జడ్డూ సత్తా ఏంటో ధోనికి తెలుసని, అందుకే తనకు ప్రాధాన్యం తగ్గించుకుని మరీ జడేజాకు మొదటి ప్రాధాన్యం కల్పించాడని టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నాడు. 

ధోని.. తన రిటైర్మెంట్ తర్వాత చెన్నై కెప్టెన్సీ పగ్గాలను  జడేజాకు అప్పజెప్పుతాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. తాజాగా  చెన్నై రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని వివరించాడు. 

ఇదిలాఉండగా.. భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అతడు మాట్లాడుతూ.. ‘ధోని కావాలనే తన ప్రాధాన్యం తగ్గించుకున్నాడు. జడేజా సత్తా ఏంటో ధోనికి బాగా తెలుసు. ధోని నిష్క్రమణ తర్వాత జడ్డూకే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పుతాడని అనుకుంటున్నాను..’ అని  చెప్పాడు. 

కెప్టెన్ కావడానికి అన్ని లక్షణాలు జడేజాలో ఉన్నాయని చెప్పిన పార్థీవ్.. టెస్టు క్రికెట్ తో పాటు వన్డేలు, టీ20లలో అద్భుతంగా రాణిస్తున్న జడేజా, ధోని తర్వాత సారథిగా సరైనోడని అనిపిస్తుందని తెలిపాడు. 

ఇదిలాఉండగా.. నలుగురిని (రైనా, ధోని, అలీ, రుతురాజ్) నిలుపుకున్న చెన్నై బ్రావో, డూప్లెసిస్, శార్దూల్ ఠాకూర్,  దీపక్ చాహర్ తో పాటు అంబటి రాయుడులను ఐపీఎల్ వేలంలో దక్కించుకోవాలని చూస్తున్నది. 

నలుగురు రిటైన్ ప్లేయర్లకు వెచ్చించింది పోను ఆ జట్టు దగ్గర ఇంకా రూ. 48 కోట్లు ఉన్నాయి. ఈ అమౌంట్ లోనే  చెన్నై మిగతా జట్టును  తయారుచేసుకోవాల్సి ఉంటుంది. 

click me!