IPL Retention: కెఎల్ రాహుల్, రషీద్ ఖాన్ లపై ఏడాది నిషేధం..? కారణమిదే..

First Published Dec 1, 2021, 1:39 PM IST

KL Rahul and Rashid Khan: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ రిటెన్షన్ జాబితా వచ్చింది.  8 జట్లు 27 మందిని రిటైన్ చేసుకున్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ నుంచి కెఎల్ రాహుల్ తప్పుకోగా.. సన్ రైజర్స్ కు రషీద్ ఖాన్ గుడ్ బై చెప్పేశాడు. 

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం కెఎల్ రాహుల్, రషీద్ ఖాన్ లకు షాక్ తగలబోతుందా..? ఈ ఇద్దరూ ఏడాది పాటు  నిషేధం ఎదుర్కోనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 

రాహుల్, రషీద్ లు ఇన్నాళ్లు ప్రాతినిథ్యం వహించిన జట్లే ఈ ఇద్దరు ఆటగాళ్లపై  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి ఫిర్యాదు చేశాయి. తమతో ఒప్పందంలో ఉంటూ ఇతర ఫ్రాంచైజీలతో డీల్ కుదుర్చుకున్నారని  యాజమాన్యాల ప్రధాన ఆరోపణగా ఉంది. 

అసలేం జరిగిందంటే.. కెఎల్ రాహుల్ పంజాబ్ సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. అలాగే రషీద్ ఖాన్ కూడా సన్ రైజర్స్  హైదరాబాద్ కు  చాలాకాలంగా ఆడుతున్నాడు.  అయితే ఈ ఇద్దరూ.. తమ జట్లతో ఒప్పందంలో ఉండగానే ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చిన లక్నో (ఇంకా పేరు పెట్టలేదు) తో సంప్రదింపులు జరిపారని ఆరోపణ. 

రాహుల్.. పంజాబ్ తో కొనసాగడానికి ఇష్టపడకపోగా.. రషీద్, సన్ రైజర్స్ తో సాగడానికి ఆసక్తి చూపలేదు. ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన  సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని లక్నో.. ఈ లీగ్ లో క్రేజ్ ఉన్న ఆటగాళ్లకు ఎర వేస్తున్నదని ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్ లు ఆరోపిస్తున్నాయి. వీరిరువురు ఆ జట్టుతో భారీ డీల్ కుదుర్చుకున్నారని ఆ రెండు ఫ్రాంచైజీలు బీసీసీఐకి మౌఖికంగా ఫిర్యాదు చేశాయి.  ఇందులో భాగంగానే రాహుల్ కు రూ. 20 కోట్లు, రషీద్ కు రూ. 16 కోట్లు ఇచ్చేందుకు లక్నో యాజమాన్యం అంగీకరించినట్టు  వార్తలు వస్తున్నాయి. 
 

అయితే దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ రెగ్యులేటరీ కమిటీ విచారణ జరుపనున్నాయి. ఒకవేళ అదే నిజమని తేలితే మాత్రం రాహుల్, రషీద్ లపై ఒక ఏడాది పాటు నిషేధం విధించే అవకాశముంది. 

గతంలో రవీంద్ర జడేజా, మనీష్ పాండేల పై కూడా ఇదే కారణంతో ఒక ఏడాది పాటు నిషేధం పడింది. గుజరాత్ తరఫున ఆడిన జడ్డూ.. ఆ జట్టుతో ఉండగానే ఇతర జట్లతో సంప్రతింపులు జరిపాడని   ఆరోపణలు వచ్చాయి. 

రషీద్.. తనను హైదరాబాద్ తొలి ప్రాధాన్యం గా (రూ. 16 కోట్లకు) తీసుకోవాలని పట్టుబట్టాడట. కానీ సన్ రైజర్స్ యాజమాన్యం మాత్రం కేన్ విలియమ్సన్ కు తొలి ప్రాధాన్యమిచ్చింది.  దీంతో రషీద్.. హైదరాబాద్ ను వీడేందుకు సిద్ధపడ్డాడు.

మరోవైపు నాలుగు సీజన్ల పాటు పంజాబ్ కు ఆడిన రాహుల్ తో లక్నో  భారీ డీల్ కుదుర్చుకుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. రూ. 20 కోట్లకు రాహుల్ ను దక్కించుకోవడానికి లక్నో సిద్ధంగా ఉంది. అయితే రాహుల్  తమతో ఉండాలని భావించామని, కానీ అతడు మాత్రం వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా పంజాబ్  మెంటార్ అనిల్ కుంబ్లే నిన్న రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను విడుదల చేసేప్పుడు తెలిపాడు. 

ఐపీఎల్ రిటెన్షన్ పాలసీ  మేరకు.. ప్రతి ఆటగాడు నవంబర్ 30 వరకు పాత ఫ్రాంచైజీతోనే ఉండాలి. ఆ లోపు ఏ జట్టుతో కూడా ఇతర ఒప్పందాలు,  సంప్రతింపులు జరుపడానికి వీళ్లేదు. రిటెన్షన్ డేట్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు వేలంలోకి వెళ్లాక అన్ని ఫ్రాంచైజీలు వారిని దక్కించుకోవడానికి అవకాశముంటుంది. 

click me!