ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న జడ్డూ భార్య.. టికెట్ కూడా ఖాయం..!

First Published Nov 9, 2022, 2:16 PM IST

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా  భార్య రివాబా జడేజా త్వరలోనే అసెంబ్లీకి వెళ్లేందుకు రంగం సిద్దం చసుకుంటున్నది.  వచ్చే నెల జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో  ఆమె  పాల్గొనే అవకాశాలు   ఎక్కువగా ఉన్నాయి. 
 

దేశం దృష్టిని ఆకర్షిస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా  భార్య కూడా పోటీ చేయనున్నది.   రివాబా జడేజా త్వరలోనే నామినేషన్ కూడా వేయనున్నారని,  రాష్ట్రంలో 27 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తరఫున  ఆమె పోటీ చేయనున్నారని తెలుస్తున్నది. 

గుజరాత్ ఎన్నికలలో పాల్గొనబోయే తమ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర  నేతలు నేడు కేంద్ర అధిష్టానానికి పంపారు.  182 మంది అభ్యర్థులతో కూడిన ఈ  జాబితాలో రివాబా పేరు కూడా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.   

కాంగ్రెస్ నాయకుడు  హరి సింగ్ సోలంకికి బంధువైన రివాబా.. 2016లో రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకుంది.   మూడేండ్ల క్రితం  బీజేపీలో చేరిన  ఆమె.. ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది. రాజ్‌పుత్ ల అనుబంధ సంస్థ  కర్ణి సేనలో  క్రియాశీలకంగా పనిచేస్తున్నది.  గుజరాత్‌లో కీలకంగా ఉండే కుల సమీకరణాల  దృష్ట్యా రాజ్‌పుత్ వర్గం  ఓట్లను ఆకర్షించడానికి రివాబాకు తప్పకుండా అవకాశం దక్కుతుందనే అభిప్రాయంలో  ఆమె కుటుంబసభ్యులున్నారు. 

అదీగాక ఈసారి  ఎన్నికలలో  75 ఏండ్లకు పైబడిన వారు ఎన్నికలలో పోటీ చేయడానికి వీళ్లేదని కేంద్ర అధిష్టానం  నిర్ణయం తీసుకుంది.  దీంతో  ముఖ్యమంత్రి విజయ్ రూపానీ,  మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ వంటి సీనియర్ నేతలు పోటీ నుంచి దూరంగా ఉన్నారు. దీంతో యువకులకు అవకాశాలు దక్కొచ్చని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అలా చూస్తే  రివాబాకు సీటు ఖాయమే. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5 వ తేదీలలో  జరుగనున్నాయి.  182 సీట్లు ఉన్న గుజరాత్ లో గడిచిన 27 ఏండ్లుగా బీజేపీ పరిపాలిస్తున్నది. అయితే గతంలో మాదిరిగా ఈసారి గుజరాత్ లో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక కాదని తెలుస్తున్నది. కొత్తగా  గుజరాత్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆప్ తో పాటు కాంగ్రెస్ కూడా  గట్టిగానే పోటీనిస్తున్నది.  
 

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల  స్వంత రాష్ట్రం కావడంతో  వాళ్లిద్దరూ  గుజరాత్ పై ప్రత్యేక దృష్టి నిలిపారు.  2017 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి 99 సీట్లు రాగా  కాంగ్రెస్ 77 సీట్లు సాధించింది. కానీ తర్వాత  పలువురు పార్టీలు మారడం, రాజీనామాలతో  బీజేపీ బలం 111 కు పెరిగింది.
 

click me!