రమీజ్ రాజాకి షాక్ ఇచ్చిన పీసీబీ... కొత్త ఛైర్మెన్‌గా నజమ్ సేతీ! వైట్ వాష్ దెబ్బకు...

First Published Dec 21, 2022, 4:17 PM IST

స్వదేశంలో ఇంగ్లాండ్ చేతుల్లో టెస్టు సిరీస్‌ని 3-0 తేడాతో వైట్ వాష్ అయ్యింది పాకిస్తాన్ క్రికెట్ టీమ్. ఈ దెబ్బకు కొన్నాళ్లుగా చేతల కంటే మాటలు ఎక్కువగా చెబుతున్న పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజాని ఆ పొజిషన్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు...
 

రమీజ్ రాజాని పీసీబీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ పాక్ క్రికెట్ బోర్డు సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ప్రధాన మంత్రి షాబజ్ షరీఫ్ ఆమోదించాడు. రమీజ్ రాజా స్థానంలో నజమ్ సేతీ, పీసీబీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నాడు.. 
 

najam sethi

పాక్ జర్నలిస్ట్, బిజినెస్ మ్యాన్ అయిన నజమ్ అజిజ్ సేథీ, ‘ది ఫ్రైడే టైమ్స్’ పత్రికను స్థాపించాడు. ఇంతకుముందు పాక్ క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా వ్యవహరించిన నజమ్ సేథీ, పాక్ ఆక్రమిత పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ పనిచేశాడు.. 


కనీసం స్వదేశంలో కూడా టెస్టు సిరీస్‌ గెలవలేని జట్టును సెలక్ట్ చేసిన సెలక్టర్లను రమీజ్ రాజా వెనకేసుకు వచ్చాడు. రమీజ్ రాజాతో పాటు పాక్ క్రికెట్ బోర్డు సెలక్షన్ ప్యానెల్ సభ్యులను కూడా తొలగించిన పీసీబీ, కొత్త సెలక్షన్ బోర్డును కూడా ఏర్పాటు చేయనుంది.. 
 

India vs Pakistan

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు పీసీబీ ఛైర్మెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రమీజ్ రాజా. పొట్టి ప్రపంచకప్‌కి ముందు పాక్ హెడ్ కోచ్‌గా ఉన్న మిస్బా వుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌ రిటైర్మెంట్ తీసుకోవడంతో అలజడి రేగింది. అయితే వారి స్థానాల్లో ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్‌కి పాక్ హెడ్ కోచ్‌గా, వర్నర్ ఫలందర్‌ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాడు రమీజ్ రాజా...

రమీజ్ రాజా సెడన్‌గా చేసిన ఈ మార్పు, పాక్‌కి బాగానే కలిసి వచ్చింది. మొదటి మ్యాచ్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది పాకిస్తాన్. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌పై పాకిస్తాన్‌కి దక్కిన మొట్టమొదటి విజయం ఇదే...

Pakistan vs England

ఈ విజయం తర్వాత విర్రవీగిపోయిన రమీజ్ రాజా, భారత జట్టును చులకన చేస్తూ చాలా మాటలు మాట్లాడారు. ఆసియా కప్ 2022 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లోనూ పాకిస్తాన్, టీమిండియాని ఓడించడంతో రమీజ్ రాజా వాగుడు మరింత పెరిగింది... అయితే ఆసియా కప్ 2023 టోర్నీ గురించి రేగిన వివాదం, రమీజ్ రాజా సీటుకే ఎసరు పెట్టింది...

షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్‌లో అడుగుపెట్టేది లేదని, తటస్థ వేదికపై టోర్నీని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మెన్ జై షా ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలపై రమీజ్ రాజా అతిగా స్పందించాడు...

‘ఆసియా కప్ 2023 టోర్నీ కోసం టీమిండియా, పాక్‌‌కి రాకపోతే.. తాము వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడం. అలాగే పాక్‌లో ఈ టోర్నీని నిర్వహించకపోతే ఆసియా కప్ కూడా ఆడం. మేం ఆడకపోతే మీ మ్యాచులు ఎవ్వరు చూస్తారు...’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు రమీజ్ రాజా...

ఈ వ్యాఖ్యలపై అటు భారత్‌లో, ఇటు పాకిస్తాన్‌లో తీవ్రమైన చర్చ జరిగింది. తాజాగా ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 3-0 తేడాతో వైట్ వాష్ అయ్యింది పాకిస్తాన్. రావల్పిండి టెస్టు జరిగిన పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా మారగా ముల్తాన్, కరాచీ పిచ్‌లపై కూడా ట్రోల్స్ వచ్చాయి...
 

click me!