TNPLలో మహిళా అంపైర్ పై అశ్విన్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Published : Jun 09, 2025, 11:23 PM IST

Ashwin: టీఎన్పీఎల్ (TNPL) మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ కోపంతో బ్యాట్, గ్లోవ్స్ విసిరిన ఘటన వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆర్ అశ్విన్ హాట్ టాపిక్ గా మారాడు.

PREV
14
టీఎన్పీఎల్ లో హాట్ టాపిక్ గా రవిచంద్రన్ అశ్విన్

R Ashwin angry video: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025 సీజన్‌లో దుండిగల్ డ్రాగన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న టీం ఇండియా మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన సంఘటన వైరల్ గా మారింది.

టీఎన్పీఎల్ 2025 లో ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిళన్స్ జట్టుతో దుండిగల్ డ్రాగన్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో అశ్విన్ ఔట్ అయిన తీరుతో అసంతృప్తిగా స్పందించి, గ్రౌండ్‌లో తన బ్యాట్‌ను గట్టిగా పడగొట్టడమే కాక, గ్లోవ్స్‌ను విసిరేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

24
అంపైర్ నిర్ణయంపై ఆర్ అశ్విన్ అసంతృప్తి

ఈ సంఘటన ఐదో ఓవర్‌లో చోటు చేసుకుంది. తిరుప్పూర్ కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ వేసిన ఓవర్‌లో ఐదవ బంతికి అశ్విన్ LBW అవగా, అశ్విన్ వెంటనే అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అశ్విన్ అభిప్రాయం ప్రకారం, ఆ బంతి లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయ్యిందని అతను పేర్కొన్నాడు. కానీ మహిళా అంపైర్ అతని వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో 18 పరుగులు చేసిన అశ్విన్ పెవిలియన్ కు చేరాడు.

34
కోపంలో ఆర్ అశ్విన్ ఏం చేశాడంటే?

అవుట్ అయి పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో అశ్విన్ తన కోపాన్ని వ్యక్తం చేస్తూ బ్యాట్‌ను గట్టిగా తన ప్యాడ్‌పై బాదాడు. ఆ తర్వాత తన రెండు గ్లోవ్స్‌ను తీసేసి దూరంగా విసిరేశాడు. డగౌట్ వద్దకు చేరిన తర్వాత కూడా అతను గట్టిగా అరిచి కోపం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో తిరుప్పూర్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసి దుండిగల్ డ్రాగన్స్‌ను కేవలం 93 పరుగులకే ఆలౌట్ చేసింది. బౌలింగ్‌లో ఎసక్కిముత్తు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఎం. మథివానన్ మూడు, సాయి కిషోర్ రెండు వికెట్లు తీశారు.

44
ఈజీగానే టార్గెట్ ఛేదించిన తిరుప్పూర్ తమిళన్స్

లక్ష్యాన్ని తిరుప్పూర్ జట్టు 11.5 ఓవర్లలోనే ఛేదించి మొదటి విజయం నమోదు చేసుకుంది. తుషార్ రాహేజా 39 బంతుల్లో అజేయంగా 65 పరుగులు చేశారు. అశ్విన్ నేతృత్వంలోని దుండిగల్ జట్టు గత మ్యాచ్‌లో లైకా కోవై కింగ్స్‌ను ఓడించినప్పటికీ, ఈ పోరులో పరాజయం పాలయ్యింది. ప్రస్తుతం TNPLలో చోటుచేసుకున్న అశ్విన్ కోపావేశం చర్చనీయాంశమవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories