Shreyas Iyer: కోహ్లీ వస్తున్నాడు.. మరి త్యాగం చేసేదెవరు..! శ్రేయస్ ఒక్క టెస్టుకే పరిమితమా..?

First Published Nov 30, 2021, 8:14 PM IST

India Vs New Zealand Test: డిసెంబర్ 3 నుంచి ముంబై లోని వాంఖడే వేదికగా రెండో టెస్టు మొదలుకానున్నది. తొలి టెస్టులో విరామం తీసుకున్న కోహ్లీ.. ముంబైలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ లో  చోటు కోల్పోయేదెవరు..?

కాన్పూర్ వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు పేలవమైన డ్రా గా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో విజయానికి ఒక్క వికెట్ దూరంలో నిలిచిన భారత్.. రెండో టెస్టుపై దృష్టి సారించింది. భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ.. ఈ టెస్టులో ఆడనున్నాడు. 

డిసెంబర్ 3 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభం కాబోయే ఈ టెస్టు కోసం మిడిలార్డర్ లో ఎవరు ఉంటారు..? ఎవరు నిష్క్రమిస్తారు..? అనే విషయంపై సందిగ్దత నెలకొంది. 

తొలి టెస్టులో అరంగ్రేటం చేసిన ముంబై హీరో శ్రేయస్ అయ్యర్..  రెండో టెస్టులో ఉంటాడా..? లేదా..? అనేది ఇప్పుడు భారత అభిమానులను వేధిస్తున్న ప్రశ్న.  అరంగ్రేట టెస్టులోనే అయ్యర్.. సెంచరీ, అర్థ సెంచరీతో రికార్డులు సృష్టించాడు. 

డెబ్యూ మ్యాచ్ లో సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా  రికార్డులకెక్కాడు. రెండో ఇన్నింగ్స్ లో అర్థసెంచరీ సాధించి భారత్ ను ఆదుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతడిని  తప్పించడానికి  వీల్లేకుండా చేసుకున్నాడు. 

అయితే రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో  తుది జట్టులోకి వచ్చిన అయ్యర్.. ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. కాగా రెండో టెస్టులో కోహ్లీ రానుండటంతో అయ్యర్ ను ఆడిస్తారా..? లేదా..? అనేది ప్రశ్నార్థకం. అయితే అయ్యర్ కు బదులు.. రహానే గానీ, పుజారాను గానీ తప్పించడం ఖాయమని తెలుస్తున్నది. 

రహానే,   పుజారాలు చాలాకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నారు. కాన్పూర్ టెస్టులో అయినా పుంజుకుంటారని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. కానీ వాళ్లు విఫలమయ్యారు. ముఖ్యంగా రహానే అయితే తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు చేసి  ఔట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు  పరుగులే చేశాడు. 

దీంతో బీసీసీఐ ఇప్పటికే రహానేకు చాలా అవకాశాలిచ్చిందని, ఇక రహానే ను తప్పిస్తేనే బెటర్ అని విమర్శకులు తమ గళాలు వినిపించారు. ఇదే సందర్భంలో  ఫామ్ లో లేని పుజారాను కూడా పక్కకుపెట్టి అయ్యర్ నే కొనసాగించాలని వాదనలు  వినిపించాయి.

ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్టర్లు ఈ ముగ్గుర్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారోననేదానిపై సందిగ్దత నెలకొంది.  అయితే అయ్యర్ కే అవకాశమివ్వాలని, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అతడు.. రాబోయే రోజుల్లో  టెస్టుల్లో కీలకంగా మారే అవకాశమున్నందున అయ్యర్ ను ఆడించాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

click me!