తెల్లారితే నా అరంగేట్రం.. మ్యాచ్ చూడమని అమ్మకు చెప్పా.. కానీ అంతలోనే..! పాక్ పేసర్ జీవితంలో విషాదం

First Published Dec 15, 2022, 5:09 PM IST

దేశవాళీలో   నానా కష్టాలు పడి  జాతీయ  సెలక్టర్ల దృష్టిలో పడటం అంత ఈజీ కాదు.  ఎన్నో  గండాలను దాటితే గానీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రాదు. ఇంటర్నేషనల్ క్రికెటర్ అరంగేట్రం చేయడం ఎవరికైనా  గొప్ప విషయం. ఆ సమయంలో తమ తల్లిదండ్రులు, ఇష్టమైన వాళ్లు తమ పక్కనే ఉండాలనుకుంటారు క్రికెటర్లు. 

ఎంతగానో ఇష్టపడి చాలా కష్టపడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రమంలో  దేశం తరఫున  ఆడటం ఏ ఆటగాడికైనా గర్వకారణమే.  కానీ తన అరంగేట్రం మాత్రం అత్యంత విషాదకరం అయిందంటున్నాడు పాకిస్తాన్ యువ పేసర్ నసీమ్ షా.  తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర  ఘటన గురించి అతడు  తాజాగా స్పందించాడు. 

ముల్తాన్ టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్  కు చెందిన స్కై స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీమ్ షా మాట్లాడుతూ.. ‘ఆరోజు నేను నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం.  నేను 12 ఏండ్ల వయసు ఉండగానే  క్రికెట్ కోసం ఇంటిని వదలాల్సి వచ్చింది. క్రికెట్ కోసం నేను లాహోర్ కు షిఫ్ట్ అయ్యాను. నేను జాతీయ జట్టుకు సెలక్ట్ అయ్యానని అమ్మకు చెప్పాను. 

పాకిస్తాన్ తరఫున తొలి మ్యాచ్ ఆడబోతున్న నాకు  ముందు రోజు అమ్మ ఫోన్ చేసింది. అప్పుడు నేను అమ్మతో.. ‘రేపు నా డెబ్యూ మ్యాచ్ ఉంది.  టీవీలో లైవ్  వస్తుంది. నేను కనబడతాను. నువ్వు తప్పకుండా చూడు..’ అని చెప్పా. వాస్తవానికి మా అమ్మకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. కానీ  నాకోసం సరే చూస్తానని చెప్పింది. నేను పాక్ తరఫున ఆడుతున్నందుకు ఆమె చాలా సంతోషించింది. 

నేను లాహోర్ లో ఆడితే మ్యాచ్ చూడటానికి వస్తానని నాతో చెప్పింది.  అయితే మరుసటి రోజు నేను  ఉదయాన్నే లేచాను. టీమ్ మేనేజ్మెంట్ నా దగ్గరికి వచ్చి  మీ అమ్మ చనిపోయిందని చెప్పారు. అప్పుడు నాకు ఏం చేయాలో తోచలేదు. అంతా అయోమయం.   ఆ తర్వాత  ఏడెనిమిది నెలలు  నా లైఫ్ లో అత్యంత కఠిన  రోజులు గడిపాను. చాలా స్ట్రగుల్ అయ్యా.  ఎంత ఓదార్చినా మన లోపల ఏముందో ఎవరూ  అర్థం చేసుకోలేరు. 

ఆ బాధను మరిచిపోవడానికి నేను చాలా మెడిసన్స్ వాడేవాడిని. ఎక్కడికెళ్లినా అమ్మే కనిపించేది. ప్రతీ క్షణం అమ్మ గురించిన ఆలోచనలే. పాకిస్తాన్ తరఫున ఆడటాన్ని కూడా ఆస్వాదించలేకపోయా. అదే సమయంలో నాకు చాలా గాయాలయ్యాయి. అది నరకం. 

కానీ ఆ సమయంలో  నేను చాలా నేర్చుకున్నా.  ఆ కష్టాలే నాకు చాలా నేర్పించాయి. ఇప్పుడు నేను మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అయ్యా.  అందరు క్రికెటర్లకు వాళ్ల  అరంగేట్రాలలో ఎన్నో మధుర  జ్ఞాపకాలుంటాయి. కానీ నాకు మాత్రం అదొక అంతులేని విషాదం...’అని  భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు నసీమ్. 

2003లో పాకిస్తాన్  లోని  పర్వత ప్రాంత రాష్ట్రమైన ఖైబర్ పంక్తువాలో జన్మించిన నసీమ్ షా.. 16 ఏండ్ల వయసులోనే  పాకిస్తాన్ తరఫున ఆడాడు. 2019 లో   పాకిస్తాన్ ఆస్ట్రేలియా వెళ్లగా అడిలైడ్ లో జరిగిన  టెస్టులో అరంగేట్రం చేశాడు.  

టీ20లలో  ఆసియా కప్ లో భారత్ మీద తొలి మ్యాచ్ ఆడాడు.   భవిష్యత్ లో పాక్ కు కీలక బౌలర్ గా ఎదుగుతున్న నసీమ్ షా.. ఇప్పటివరకు పాక్ తరఫున 13 టెస్టులు,  3 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. టెస్టులలో 38, వన్డేలలో 10, టీ20లలో 14 వికెట్లు పడగొట్టాడు. 

click me!