Image Credit: TwitterMumbai Indians
Hardik Pandya on the Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బాధితులకు అండగా ఉంటామనీ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలనీ, ఇలాంటి సమయంలోనే మనం బలంగా నిలబడాలని పేర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ఇలాంటి దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. పహల్గామ్ ఘనత గురించి తెలిసి చాలా బాధపడ్డానని తెలిపారు. "నా ఆలోచనలు బాధితులు, వారి కుటుంబాలతో ఉన్నాయని" హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు.
అలాగే, ఐపీఎల్ 2025లో 41వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో పాటు స్టేడియంలోని అందరూ పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంతాపం తెలుపుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. శాంతి, మానవతవాదం కోసం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే, ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర సిబ్బంది నలుపు బ్యాండ్లు ధరించి నివాళులు అర్పించారు.
Hardik Pandya (Photo: IPL)
టాస్ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడి బాధితులకు సంతాపం తెలిపాడు. ఒక జట్టుగా, ఫ్రాంచైజీగా తాము అలాంటి దాడులను ఖండిస్తున్నామని చెప్పాడు. బాధితులకు అండగా ఉంటామని తెలిపాడు.
అలాగే, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. హృదయాన్ని ముక్కలు చేసే ఘటనగా పేర్కొంటూ విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలుపుతూ బాధితులకు అండగా నిలవాల్సిన సమయంగా పేర్కొన్నారు.
Virat Kohli
వీరితో పాటు పహల్గామ్ దాడిని యావత్ క్రికెట్ ప్రపంచం ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని క్రికెటర్లు సందేశం ఇచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, ఆకాశ్ చోప్రా, మనోజ్ తివారీ, యువరాజ్ సింగ్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా సహా పలువురు క్రికెటర్లు దాడిని ఖండించారు.
పహల్గామ్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన గుండె పగిలిపోయిందని రోహిత్ శర్మ పగిలిన హార్ట్ సింబల్ ను పంచుకున్నాడు.