హాట్ కేకుల్లా టీ20 ప్రపంచకప్ టికెట్లు.. గ్రూప్ స్టేజ్, సూపర్-12కు స్టేడియాలు ఫుల్..!

First Published Sep 15, 2022, 1:01 PM IST

T20I World Cup 2022: అక్టోబర్13 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్  చూడటానికి క్రికెట్ ప్రేమికులు అమితాసక్తి వెలిబుచ్చుతున్నారు.  ఈ మేరకు అమ్ముడుపోయిన టికెట్లే ఇందుకు నిదర్శనం. 
 

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించదలిచిన  టీ20 ప్రపంచకప్ - 2022  టోర్నీ ప్రారంభానికి ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది.  అక్టోబర్ 16 నుంచి  నవంబర్ 13 వరకు జరుగబోయే ఈ టోర్నీని చూడటానికి క్రికెట్ ప్రేమికులు అమితాసక్తిని చూపుతున్నారు.  

సుమారు నెల రోజుల పాటు  16 దేశాలు తలపడబోయే పొట్టి ప్రపంచకప్ సమరాలను వీక్షించడానికి సుమారు 82 దేశాల నుంచి  టికెట్లు కొనుగోలు చేశారట. క్వాలిఫయింగ్, సూపర్-12 గ్రూప్ స్టేజ్ వరకు ఇప్పటికే 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు ఐసీసీ తెలిపింది.

Latest Videos


రెండేండ్ల పాటు కరోనా వలయంలో చిక్కుకుని విలవిల్లాడిన ఆస్ట్రేలియన్లు.. ఈ భారీ ఈవెంట్ కు  స్టేడియాలను కళకళలాడించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా కూడా  టికెట్ రేట్లను అందుబాటు ధరలకే విక్రయిస్తున్నది.  

ఇప్పటికే చిన్నపిల్లలకు  85వేలకు పైగా టికెట్లను విక్రయించినట్టు ఐసీసీ తెలిపింది.  చిన్న పిల్లలకు టికెట్ ధరను 5 ఆస్ట్రేలియన్ డాలర్లుగా నిర్ణయించగా వయోజనులకు 20 ఆస్ట్రేలియన్ డాలర్లుగా  ఉంది. దీంతో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

క్వాలిఫయింగ్, సూపర్-12 గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు గాను టికెట్లను విక్రయించిన ఐసీసీ..  ఆసీస్ లోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ అయిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో కూడా  సీటింగ్ కెపాజిటీ  (86,174 సీట్లు) సీట్లన్నీ అమ్ముడుపోయినట్టు  ఐసీసీ తెలిపింది. 

ఇక ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు  భారత్ - పాకిస్తాన్  మధ్య  మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం  ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ కోసం ప్రేక్షకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది గనక.. స్టాండింగ్ టికెట్స్ ను కూడా అందుబాటులో ఉంచగా.. అవి కూడా అమ్ముడైనట్టు   ఐసీసీ తెలిపింది. ఇండియా-పాకిస్తాన్ తో పాటు  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ లలో కూడా టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.

సీట్లన్నీ ఫుల్ అవడంతో  ఐసీసీ  ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ మాట్లాడుతూ.. ‘ఈ మెగా టోర్నీకి  అభిమానుల నుంచి మంచి స్పందన వస్తున్నది.  ఇప్పటికే 5 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. 

వరల్డ్ కప్ కు ఇంకా దాదాపు నెల సమయమున్నప్పటికీ  అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తూ టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. మా వెబ్ సైట్ లో ఇంకా కొన్ని టికెట్స్ ఉన్నాయి. అవి కూడా టోర్నీ  ప్రారంభం వరకు అందుబాటులో ఉంచుతాం’అని  చెప్పాడు.
 

click me!