ఆ విజయం ఇచ్చిన కిక్ ఇక దిగనేలేదబ్బా... గబ్బాలో టీమిండియా చరిత్రకి ఏడాది...

First Published Jan 19, 2022, 2:28 PM IST

టీమిండియా ఇంతకుముందు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది, ఆస్ట్రేలియాలో ఆసీస్‌నే ఓడించింది. అయితే గబ్బా టెస్టు విజయం మాత్రం చాలా చాలా స్పెషల్. సీనియర్లు లేకుండా, యువకులతో నిండిన భారత జట్టు... 32 ఏళ్లుగా ఓటమి ఎరుగని ఆసీస్ కంచుకోట గబ్బాలో వారికి ‘అబ్బా...’ అనిపించే విజయాన్ని అందుకోన్నది ఈరోజే...

ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత ఆసీస్ టూర్‌ను వరుస ఓటములతో ఆరంభించింది టీమిండియా... ఆ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చి టీ20 సిరీస్ గెలిచినా... ఆడిలైడ్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఘోర పరాజయంతో కృంగిపోయింది. 

36/9 పరుగులు చేసి పీడకల లాంటి పరాజయం ఎదుర్కొన్న భారత జట్టు... గాయపడిన పులిలా గర్జించింది. వెనకడుగు వేసిన సింహాంలా ప్రత్యర్థిని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తూ అసాధారణ విజయాలను అందుకుని, సిరీస్‌నే సొంతం చేసుకుంది. 

భారత జట్టు ఇంతకుముందు ఎన్నో విజయాలు అందుకున్నా, ఈ టెస్టు సిరీస్ విజయం మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే కేవలం రిజర్వు బెంచ్ ఆటగాళ్లతో బరిలో దిగి, విజయన్ని అందుకున్న భారత జట్టు... టీమిండియా ఫ్యూచర్‌ను కళ్లకు కట్టినట్టు చూపించింది.
 

టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు స్టీవ్ స్మిత్, లబుషేన్, డేవిడ్ వార్నర్‌లతో కూడిన ఆస్ట్రేలియాను ఓడించడం అంత తేలిక కాదని, టీమిండియా ఈసారి కచ్చితంగా టెస్టు సిరీస్ ఓడిపోతుందని అంచనా వేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు.
 

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్‌తో పాటు మైకేల్ వాగన్ కూడా భారత జట్టు 4-0 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోతుందని కామెంట్ చేశారు.

మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్‌గా టెస్టు ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో 45, రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగులతో రాణించాడు.

ఇదే టెస్టులో ఆరంగ్రేటం చేసిన మహ్మద్ సిరాజ్... మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు...

బాక్సింగ్ డే టెస్టులో భారత తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే ఆడిన ఇన్నింగ్స్ చాలా చాలా స్పెషల్. 223 బంతుల్లో 12 ఫోర్లతో సెంచరీ బాది, భారత జట్టును ముందుండి నడిపించాడు రహానే..
 

సిడ్నీ టెస్టులో భారత జట్టు అద్భుతంగా పోరాడి, మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ చేయగా... రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ చేసిన 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

పంత్, ఛతేశ్వర్ పూజారా అవుటైన తర్వాత హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 50 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

సీనియర్లు లేకుండా పూర్తిగా రిజర్వు బెంచ్‌తో నాలుగో టెస్టులో బరిలో దిగింది భారత జట్టు. బుమ్రా, ఉమేశ్, షమీ, అశ్విన్, జడేజా, విరాట్ కోహ్లీ లేకుండా గబ్బా టెస్టులో గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది.

మొదటి టెస్టు ఆడుతున్న నటరాజన్, వాషింగ్టన్ సుందర్, రెండో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్, మూడో టెస్టు ఆడుతున్న శుబ్‌మన్ గిల్, సిరాజ్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు...

మొదటి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టును శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఆదుకున్న విధానం చూసి ఆస్ట్రేలియానే షాక్ అయ్యింది.

గబ్బా పిచ్‌పై ఐదో రోజు 328 పరుగుల భారీ టార్గెట్‌ను యువకులతో కూడిన భారత జట్టు చేధించడం అసాధ్యం అనుకున్నారంతా...

అయితే 32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాని ఓడించి, ఊహించని షాక్ ఇచ్చింది భారత రిజర్వు బెంచ్. ప్యాట్ కమ్మిన్స్, హజల్‌వుడ్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్ వంటి వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్లను భారత యువ బౌలర్లు ఎదుర్కొన్న విధానం నిజంగా అసాధారణం.

రిషబ్ పంత్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఈజీగా బౌండరీలు బాదాడు. శుబ్‌మన్ గిల్ చేసిన 91 పరుగులు టీమిండియా విజయానికి బాటలు వేశాయి.

రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఫెయిల్ అయిన చోట తేలిగ్గా పరుగులు సాధించి, చారిత్రక విజయాన్ని అందించారు కుర్రాళ్లు...

ఈ విజయం పూర్తిగా కుర్రాళ్లదే... సీనియర్లు లేకున్నా, విదేశీ పిచ్‌లపై ఆడుతున్నా... భారత జట్టుని ఓడించడం అంత ఈజీ కాదని నిరూపించి, విమర్శకులకు చెంపదెబ్బ కొట్టారు.

యువకుల దెబ్బకు వందో టెస్టు ఆడుతున్న నాథన్ లియాన్‌ కూడా కళ్లు తేలేశాడు... ఈజీగా బౌండరీలు బాదుతుండడంతో ఎక్కడ బౌలింగ్ చేయాలో తికమక పడ్డాడు.

వరల్డ్ నెం. 1 బౌలర్ అయిన ప్యాట్ కమ్మిన్స్‌ను కూడా వదల్లేదు మన కుర్రాళ్లు. కమ్మిన్స్ బౌలింగ్‌లో రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బౌండరీలు బాదారు.

ఆస్ట్రేలియా మోస్ట్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు రాబట్టారు రిషబ్ పంత్, పూజారా. అతని టెస్టు కెరీర్‌లోనే ఇదో చెత్త రికార్డు.
 

విరాట్ కోహ్లీ లేడు... సీనియర్ బౌలర్లను గాయపరిచి ఆడకుండా చేశాం... ఇంక గబ్బాలో టెస్టు గెలవడమే తరువాయి... అని వీర్రవీగిన ఆస్ట్రేలియాకి భారత జట్టు రిజర్వు బెంచ్ ఇచ్చిన షాక్ రికార్డులో పుస్తకాల్లో స్థానం దక్కించుకుంది.

click me!