NZ vs ENG: చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్..

First Published | Nov 30, 2024, 7:11 PM IST

NZ vs ENG: న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్ లో 9,000 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్లాక్ క్యాప్స్ బ్యాటర్‌గా రికార్డులను బద్దలు కొట్టాడు. 
 

Kane Williamson

NZ vs ENG : ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లలో ఒక‌డు, న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్ కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో తన దేశం తరఫున 9 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఘ‌న‌త సాధించాడు. 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విలియమ్సన్ ఈ రికార్డును అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీ సాధించిన త‌ర్వాత ఈ రికార్డును అందుకుని ప్ర‌త్యేక క్ల‌బ్ లో చేరాడు. మ్యాచ్ మూడో రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేన్ మామ 9 వేల పరుగుల మార్కును దాటాడు.

గాయం నుంచి తిరిగొచ్చి సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడిన కేన్ విలియమ్సన్

శనివారం క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో ఇంగ్లండ్‌పై విలియమ్సన్ అద్భుతం చేశాడు. వెన్ను గాయం నుంచి కోలుకున్న తర్వాత క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన అత‌ను మంచి ఇన్నింగ్స్ లో అద‌ర‌గొట్టాడు. అంత‌కుముందు భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఆడలేకపోయాడు. కానీ, ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ అంత‌ర్జాతీయ క్రికెట్ లో మ‌రో ఘ‌త‌న సాధించాడు. 


యూనిస్ ఖాన్‌తో కలిసి సంగక్కరను సమం చేసిన కేన్ విలియ‌మ్స‌న్ 

34 ఏళ్ల విలియమ్సన్ తన 103వ టెస్టు మ్యాచ్‌లో 9000 ప‌రుగుల మార్క్ ఘనత సాధించాడు. ఈ క్ర‌మంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మెన్ యూనిస్ ఖాన్‌లతో కలిసి 9,000 టెస్ట్ పరుగులు చేసిన ఉమ్మడి మూడవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తన 99వ టెస్టులో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మెన్‌గా టాప్ లో ఉన్నాడు. 

Kane Williamson, Virat Kohli,

టెస్టుల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 9 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్

స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 99 టెస్టులు
బ్రియాన్ లారా (వెస్టిండీస్) - 101 టెస్టులు
కుమార సంగక్కర (శ్రీలంక) - 103 టెస్టులు
యూనిస్ ఖాన్ (పాకిస్థాన్) - 103 టెస్టులు
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) - 103 టెస్టులు

కేన్ విలియ‌మ్స‌న్ ఒక్క‌డే.. 

ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్స‌న్ ఒక్క‌డే కీవీస్ బ్యాటింగ్ లో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 7 ప‌రుగుల దూరంలో సెంచ‌రీని కోల్పోయాడు. అయితే, అత‌ని 93 పరుగుల ఇన్నింగ్స్ తో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 348 ప‌రుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కేన్ మామ 61 ప‌రుగులు చేశాడు. 

న్యూజిలాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌట్ అయింది. గ్లెన్ ఫిలిప్స్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, బ్రేడన్ కార్సే, షోయబ్ బషీర్ చెరో వికెట్ తీశారు. హ్యారీ బ్రూక్ 171 పరుగుల పేలుడు ఇన్నింగ్స్, కెప్టెన్ బెన్ స్టోక్స్ 80, ఒలీ పోప్ 77 పరుగులతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 499 పరుగులు చేసి 151 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

స్వల్ప ఆధిక్యంలో న్యూజిలాండ్

మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. 4 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. డారిల్ మిచెల్ 31, నాథన్ స్మిత్ 1 పరుగుతో నాటౌట్‌గా ఉన్నారు. 24 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర, 19 పరుగుల వద్ద గ్లెన్ ఫిలిప్స్ ఔట్ అయ్యారు. డెవాన్ కాన్వే 8 పరుగులు చేసి ఔట్ కాగా, కెప్టెన్ టామ్ లాథమ్ 1 పరుగుతో ఔటయ్యాడు. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ ఖాతా తెరవలేకపోయాడు.

Latest Videos

click me!