జూనియర్లుగా సాధించాం.. ఇక సీనియర్లుగా పోరాడాలి.. అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Feb 3, 2023, 11:33 AM IST

Womens World Cup 2023: అండర్ - 19 అమ్మాయిలు భారత్ కు తొలి మహిళల  ఐసీసీ ట్రోఫీ అందించారు.  ఈ విజయంలో   కెప్టెన్ షెఫాలీ పాత్ర కీలకం. ఆమె టీమ్ కు ఇచ్చిన ధైర్యంతో తామంతా స్ఫూర్తిపొందామని అంటోంది రిచా ఘోష్.. 

దక్షిణాఫ్రికా వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన మహిళల అండర్ - 19  ప్రపంచకప్ ను  షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు  గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ నెల నుంచి మొదలుకాబోయే (ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు) సీనియర్ వరల్డ్ కప్ మీద కన్నేసింది. జూనియర్ టీమ్ కు సారథిగా ఉన్న ఆమె.. సీనియర్ టీమ్ లో మాత్రం  ఓపెనింగ్ బ్యాటర్, స్పిన్నర్ గా సేవలందించనుంది.  

అండర్ - 19  వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో తనతో పాటు  ఆడిన రిచా ఘోష్ కూడా  సీనియర్ టీమ్ మెంబరే. ఈ ఇద్దరూ ఇప్పుడు దక్షిణాఫ్రికాలోనే ఈనెల 10 నుంచి మొదలుకావాల్సిన ఉన్న మహిళల టీ20 ప్రపంచకప్ లో  ఆడేందుకు సిద్ధమవుతున్నారు. 

కాగా,  ప్రపంచకప్ గెలిచిన షెఫాలీ సేనకు భారత్ - న్యూజిలాండ్ నడుమ ముగిసిన మూడో  టీ20కి ముందు  బీసీసీఐ తో పాటు  భారత క్రికెట్  దిగ్గజం సచిన్ టెండూల్కర్  అమ్మాయిలను సత్కరించి  వారిపై ప్రశంసలు కురిపంచాడు. ఈ సత్కారం ముగిసిన తర్వాత షెఫాలీ - రిచాలు   మాట్లాడుకున్నారు. 

రిచాతో షెఫాలీ.. ‘జూనియర్ వరల్డ్ కప్ కొట్టేశాం. ఇక సీనియర్ ప్రపంచకప్ ను  కూడా సాధించాలి రిచా. ఏదేమైనా సరే.. గట్టిగా పోరాడదాం..’ అని  చెప్పింది.  ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.  కాగా   షెఫాలీ సారథ్యంపై  రిచా ప్రశంసలు కురిపించింది. 

ప్రపంచకప్ ముగిసిన తర్వాత  రిచా మాట్లాడుతూ... ‘ప్రతి మ్యాచ్ కు ముందు నాకు కొంచెం కంగారుగా ఉండేది. కానీ షెఫాలీ నా దగ్గరకు వచ్చి.. ‘నువ్వేం కంగారుపడకు. మనం మ్యాచ్ గెలుస్తున్నాం..’అని చెప్పేది. టీమ్  అంతటికీ ఇది ఒక  మందులా అందరి బాడీల్లోకి ఎక్కేసింది. ఈ టీమ్ కు షెఫాలీ స్ఫూర్తినిచ్చింది..’అని  తెలిపింది. 

అంతేగాక  ‘మేము వరల్డ్ కప్ టైటిల్ గెలిచాం. వరల్డ్ కప్ విన్నర్ గా  నా ఫీలింగ్ అద్భుతం.  నేను ఇంకా  ఆ కలల్లోనే ఉన్నా. భారత్ కు మహిళల విభాగంలో ఇదే మొదటి ప్రపంచకప్.  భవిష్యత్ లో రాబోయే ఆటగాళ్లు దీనిని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం..’అని చెప్పింది. 

click me!