కోహ్లీ కాదు.. ఐపీఎల్‌లో మోస్ట్ స్టైలిష్ ప్లేయర్ అతడే : సురేశ్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Jan 31, 2023, 5:31 PM IST

IPL 2023: భారత క్రికెట్  జట్టుతో పాటు ఐపీఎల్ లో  మెరుపులు మెరిపించే అతికొద్దిమంది భారత క్రికెటర్లలో   విరాట్ కోహ్లీ ఒకడు. ఐపీఎల్ లో అత్యధిక  పరుగుల రికార్డు కూడా అతడి పేరు మీదే ఉంది.  

2008 నుంచి  సాగుతున్న  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన వారు కొద్దిమందే ఉన్నారు.  భారత క్రికెట్ నుంచి అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా,  ఎంఎస్ ధోని వంటి వారు  ఈ జాబితాలో ముందుంటారు. అయితే ఐపీఎల్  లో ఇప్పటివరకు ఎంతోమంది దిగ్గజాలు వచ్చినా టీమిండియా సారథి  రోహిత్ శర్మ మాత్రం ఈ లీగ్ లో  మోస్ట్ స్టైలిష్ ప్లేయర్ అంటున్నాడు  రైనా. 

రోహిత్ తో కలిసి  అటు జాతీయ జట్టులో, ఇటు ఐపీఎల్ లోనూ ఆడిన  రైనా.. ప్రస్తుతం  ఆట నుంచి రిటైర్ అయ్యాడు.  మిస్టర్ ఐపీఎల్ గా పిలవబడే  రైనా.. తన దృష్టిలో  ఐపీఎల్ లో  ఆటను కళాత్మకంగా ఆడటంలో హిట్‌మ్యాన్  తీరే వేరని కొనియాడాడు.  ఇటీవల జియో సినిమాస్ తో  ముచ్చటిస్తూ  రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు. తన ఆట చూస్తున్న కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా ఉంటుందని రైనా వ్యాఖ్యానించాడు.  

Image credit: PTI

వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు చేసిన రోహిత్..  అంతర్జాతీయ టీ20 కెరీర్ లో కూడా నాలుగు సెంచరీలు బాదాడు. టీ20 క్రికెట్ లో  అత్యధిక పరుగుల జాబితాలో   కోహ్లీ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.  ఐపీఎల్ లో  కూడా ముంబై ఇండియన్స్ తరఫున  మెరుపులు మెరిపించిన ఈ  వెటరన్ బ్యాటర్.. ఆ జట్టు ఐదు ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర  పోషించాడు. కానీ సుదీర్ఘకాలం సారథిగా ఉన్నా  కోహ్లీ మాత్రం ఒక్క  ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేదు. 

మొత్తంగా ఐపీఎల్  లో  రోహిత్.. 222 ఇన్నింగ్స్ లలో  5,879 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 40 హాఫ్ సెంచరీలున్నాయి.  భారత్ తరఫున ఐపీఎల్ లో అత్యధిక పరుగులు  సాధించినవారిలో  రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు.  రోహిత్ కంటే ముందు ధావన్, కోహ్లీ ఉన్నారు. 

ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో  విరాట్ కోహ్లీ (6,624 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు.   ఆ తర్వాత శిఖర్ ధావన్.. 6,244 రన్స్ తో రెండో స్థానంలో నిలిచాడు.  మూడో స్థానం  హిట్‌మ్యాన్ దే.   సురేశ్ రైనా  (5,528 రన్స్) నాలుగో స్థానంలో ఉన్నాడు.  మరో 22 పరుగులు చేస్తే ధోని ఐపీఎల్ లో 5 వేల పరుగులు పూర్తి చేస్తాడు. 

click me!