డబుల్ సెంచరీ తర్వాత ఇలా ఆడటమేంటి..? : ఇషాన్ కిషన్ పై గౌతీ ఫైర్

First Published Jan 31, 2023, 2:29 PM IST

INDvsNZ: టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్  గతేడాది డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో ముగిసిన మూడో వన్డేలో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు.

గతనెలలో డబుల్ సెంచరీ తర్వాత కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేయడానికి కూడా తంటాలు పడుతున్న టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ పై  భారత మాజీ క్రికెటర్  గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబుల్ సెంచరీ ఒక్కటే చేస్తే సరిపోదని  ఆ తర్వాత  నిలకడగా ఆడాలని సూచించాడు. 

బంగ్లాదేశ్ తో మూడో వన్డే లో డబుల్ సెంచరీ చేసిన తర్వాత ఇషాన్.. శ్రీలంకతో  టీ20 సిరీస్,  న్యూజిలాండ్ తో  వన్డే,  పొట్టి ఫార్మాట్ లలో ఆడుతున్నాడు.  కానీ దారుణంగా విఫలమవుతూ విమర్శల పాలవుతున్నాడు.  రెండ్రోజుల క్రితం లక్నో వేదికగా ముగిసిన  రెండో టీ20లో కూడా ఇషాన్  ఆడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

తాజాగా ఇదే విషయమై గౌతం గంభీర్  స్పందిస్తూ... ‘బంగ్లాదేశ్ తో డబుల్ సెంచరీ చేసిన తర్వాత  ఇషాన్ కిషన్ ఇలా ఆడుతుండటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్    క్రీజులో నిలవడానికి సతమతమవుతున్నాడు.   వాస్తవానికి  ఆ ఘనత తర్వాత  ఇషాన్ కెరీర్ గ్రాఫ్ పెరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ  పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది..’అని అన్నాడు. 

డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్..  8 ఇన్నింగ్స్ (5 టీ20, 3 వన్డేలు) లలో కలిపి  93 పరుగులు మాత్రమే చేశాడు. టీ20లలో  తరుచూ విఫలమవుతున్నా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడికే వరుసగా అవకాశాలనిస్తున్నది. ఇక వన్డేలలో అతడి రికార్డులు అత్యంత దారుణంగా ఉన్నాయి.  గడిచిన 15 ఇన్నింగ్స్ లలో  కిషన్ బ్యాటింగ్ సగటు 15.3గా ఉండగా స్ట్రైక్ రేట్.. 106గా ఉంది. 
 

Gautam Gambhir

ఇదిలాఉండగా.. లక్నో  టీ20లో స్పిన్ కు అనుకూలించిన పిచ్ పై  బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు యత్నించారని, అందుకే విఫలమయ్యారని గంభీర్ అన్నాడు.  ముఖ్యంగా టీమిండియాలో ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెడుతున్న కుర్రాళ్లు.. భారీ షాట్లు ఆడేందుకంటే సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడం మీద దృష్టి సారించాలని చెప్పాడు. 

ఇషాన్ కిషన్ కూడా రెండో టీ20లో  విఫలమయ్యాడు. 32 బంతులాడిన  అతడు.. 19  పరుగులు మాత్రమే చేయగలిగాడు.   పిచ్  స్పిన్ కు అనుకూలిస్తుండటంతో  ఇషాన్ ఇబ్బందులు పడ్డాడు. బ్రాస్‌వెల్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఇషాన్  చెమటోడ్చాల్సి వచ్చింది. చివరికి లేని పరుగు కోసం యత్నించి   రనౌట్ అయ్యాడు. 
 

click me!