నా చేతుల్లో లేనిదాని గురించి నేను ఆలోచించను.. సూర్య కూడా నాలాగే.. : సర్ఫరాజ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Jan 23, 2023, 5:46 PM IST

Sarfaraz Khan: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కొద్దిరోజుల క్రితమే  ప్రకటించిన జట్టులో ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ పేరు లేదు.  ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన ప్రతీ విషయం చర్చనీయాంశమే అవుతున్నది. 

ఇటీవల కాలంలో భారత  క్రికెట్ లో దేశవాళీలో నిలకడగా రాణించి  జాతీయ జట్టుకు ఎంపిక  కాలేకపోతున్న  ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ గురించి  చర్చలు జోరుగా సాగుతున్నాయి. అతడి టాలెంట్ ను బీసీసీఐ  వేస్ట్ చేస్తున్నదని, ఇంకా ఏం చేస్తే సర్ఫరాజ్ ను జాతీయ జట్టుకు ఎంపికచేస్తారని  క్రికెట్ విశ్లేషకులు, మాజీలు, టీమిండియా ఫ్యాన్స్  బీసీసీఐని నిలదీస్తున్నారు. 

ఆస్ట్రేలియా తో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కొద్దిరోజుల క్రితమే  ప్రకటించిన జట్టు (తొలి రెండు టెస్టులకు) లో కూడా సర్ఫరాజ్ ఖాన్ పేరు లేదు.  ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన ప్రతీ విషయం చర్చనీయాంశమే అవుతున్నది. తాజాగా అతడు  ఓ  జర్నలిస్టుతో  ముచ్చటిస్తూ  తాను జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడంతో పాటు సూర్యకుమార్ యాదవ్ పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా సర్ఫరాజ్ కు  చోటు దక్కుతుందని భావించినా అతడి స్థానంలో టీ20లలో అదరగొడుతున్న సూర్యకు చోటిచ్చారు సెలక్టర్లు. ఇదే విషయమై సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ‘సూర్య టెస్టు జట్టులోకి రావడం, టీ20లలో స్థానం సుస్థిరం చేసుకోవడం నాకు స్ఫూర్తినిచ్చేదే. అతడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.  మేం జట్టు (ముంబై)లో ఉన్నప్పుడు  చాలా  సమయం గడుపుతాం.   నేను సూర్య నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. 

సూర్య కూడా జాతీయ జట్టులోకి రావడానికి చాలా కాలం వేచి చూశాడు.   రంజీలలో తన అనుభవాన్ని   టీ20లలో   చూపెడుతున్నాడు.  ఆ విధంగా టెస్టులలోకి ఎంట్రీ ఇస్తున్నాడు..’ అని అన్నాడు.  సర్ఫరాజ్ మాదిరిగానే  జాతీయ జట్టులోకి రావడానికి సూర్య చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.  కానీ జాతీయ జట్టులోకి వచ్చాక అతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 

ఇక  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి తాను ఎంపిక కాకపోవడం పై సర్ఫరాజ్ స్పందిస్తూ.. ‘ప్రతీ మ్యాచ్ కు ముందు నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే.. ఏదేమైనా నేను పరుగులు చేయాలి. అది సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీనా, విజయ్ హజారేనా, రంజీ ట్రోఫీనా అన్నది అనవసరం. 

నేను నా ఆటను ఆస్వాదిస్తా.   నా దృష్టి ఎప్పుడూ  స్కోర్లు చేయడం మీదే ఉంటుంది.  ఇక సెలక్షన్ (జాతీయ జట్టులో) అనేది నా చేతుల్లో లేని విషయం. దాని గురించి నేను పట్టించుకోను.   అసలు దాని గురించి ఆలోచించను కూడా..’ అని కుండబద్దలు కొట్టాడు. గత రంజీ సీజన్ లో  982 పరుగులు చేసిన ఈ ముంబై చిచ్చరపిడుగు.. ప్రస్తుత సీజన్  లో కూడా అదరగొడుతున్నాడు.  ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడి  9 ఇన్నింగ్స్ లలో  556 రన్స్ చేశాడు. 

click me!