స్వదేశంలో భారత్‌ను ఓడించాలంటే ఇలా చేయండి.. ఆసీస్‌కు మాజీ హెడ్ కోచ్ కీలక సూచనలు

First Published Jan 23, 2023, 2:40 PM IST

INDvsAUS: ప్రస్తుతం న్యూజిలాండ్ తో  వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టు  దాని తర్వాత  మూడు టీ20 లు ఆడాల్సి ఉంది. అనంతరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో   ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ  ఆడనుంది.  

వచ్చే నెలలో భారత పర్యటనకు రాబోయే ఆస్ట్రేలియా జట్టు.. ఇక్కడ  టీమిండియాకు  ఓటమి రుచి చూపించడానికి తన దగ్గర ఉన్న అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే జట్టును ప్రకటించిన  ఆస్ట్రేలియా..  టీమిండియాను మానసికంగా దెబ్బ తీయడానికి  మైండ్ గేమ్ కు కూడా తెరతీసింది.  పలువురు మాజీ క్రికెటర్లు భారత్ లో భారత్ ను ఓడించడానికి  ప్యాట్ కమిన్స్ అండ్ కో. కు  సూచనలిస్తూ వారిలో కాన్ఫిడెన్స్ ను పెంచుతున్నారు. 

కీలక సిరీస్ ముందు ఆసీస్ కు ఆ జట్టు మాజీ ఆటగాడు, గతంలో హెడ్ కోచ్ గా కూడా పనిచేసిన డారెన్ లీమన్ కీలక సూచనలు చేశాడు.   భారత్ ను భారత్ లో ఓడించడం అంత వీజీ కాదని, కానీ స్పిన్ విభాగం  బలంగా ఉంటే టీమిండియాను ఓడించొచ్చని  చెప్పాడు. 
 

ఆస్ట్రేలియా రేడియో స్టేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  లీమన్ మాట్లాడుతూ..  ‘స్వదేశంలో టీమిండియా చాలా బలమైన జట్టు. తొలి టెస్టులో ఓడినా తర్వాత పుంజుకుని సిరీస్ లు గెలవడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.   2017లో మనం (ఆస్ట్రేలియా) అలాగే బొక్క బోర్లా పడ్డాం.  కానీ కాస్త తెలివిగా ఆలోచిస్తే భారత్ ను ఓడించొచ్చు.

ఉపఖండపు పిచ్ లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో  భారత్ లో కూడా పేస్ ట్రాక్ లు వెలుస్తున్నా  టెస్టులలో మాత్రం స్పిన్నర్లదే హవా. ఆసీస్  జట్టులో  నాథన్ లియోన్  ప్రధాన స్పిన్నర్ గా ఉన్నాడు.     అతడు ఆఫ్ స్పినర్నర్. లియోన్ కు తోడుగా  ఒక లెగ్ స్పిన్నర్ ను తుది జట్టులోకి తీసుకుంటే  కాంబినేషన్ బాగా కుదురుతుంది.  

Ashton Agar

ఈ సారి టీమ్ లో లియోన్ తో పాటు ఆస్టన్ అగర్, మిచెల్ స్వెప్సన్, టాడ్ ముర్ఫీ వంటి స్పిన్నర్లు ఉన్నారు. భారత్  లో ఉండే స్పిన్ పిచ్ లపై  వికెట్లు తీయడానికి స్వెప్సన్ కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సిరీస్ లో  ఆసీస్..  ఇద్దరు  స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుందో లేదా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో వెళ్లుతుందో చూడాలి. ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తే లియోన్ తో పాటు ఆస్టన్ అగర్ బెటర్ ఆప్షన్. 

అగర్.. స్పిన్ తో పటు బ్యాటింగ్ కూడా చేయగలడు. ముగ్గురు స్పిన్నర్లతో వెళ్తే మాత్రం  స్వెప్సన్ ను కూడా తీసుకోవచ్చు. అలా అయితేనే భారత్ ను కట్టడి చేయగలం. టీమిండియా కూడా కచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లు, ఓ పార్ట్ టైమ్ స్పిన్నర్ తోనే బరిలోకి దిగుతుంది.. కానీ అక్కడి పిచ్ ల మీద వారికి పూర్తి అవగాహన ఉంటుంది. ఇది మనకు ప్రతికూలాంశం..’అని లీమన్ తెలిపాడు. కాగా, ఫిబ్రవరి 9 నుంచి భారత్ - ఆస్ట్రేలియా మధ్య  తొలి టెస్టు ప్రారంభం కానున్నది. 
 

click me!