బాబర్ ఆజమ్ వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడు.. పాక్ టీమ్‌కు ఆ సత్తా లేదు : పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ కామెంట్స్

First Published Jan 23, 2023, 1:39 PM IST

స్వదేశంలో వరుసగా సిరీస్ లు కోల్పోయి   తీవ్ర విమర్శల పాలవుతున్న పాకిస్తాన్ క్రికెట్  జట్టు సారథి  బాబర్ ఆజమ్ పై  తాజాగా ఆ దేశానికి చెందిన మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా సంచలన ఆరోపణలు చేశాడు.  

అసలే సొంతగడ్డపై వరుస సిరీస్ లు కోల్పోయి  కెప్టెన్సీ కూడా కోల్పోయే ప్రమాదంలో ఉన్న పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ పై  ఇటీవలే విడుదలైన  వీడియో అక్కడి క్రికెట్ వర్గాలలో తీవ్ర దుమారం రేపుతున్నది. తాజాగా బాబర్ పై ఆ జట్టు మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా తీవ్ర ఆరపణలు చేశాడు.  బాబర్ కేవలం తన వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడని వాపోయాడు.  

తన యూట్యూబ్ ఛానల్ వేదికగా  కనేరియా మాట్లాడుతూ... ‘మేం (పాకిస్తాన్)  బాబర్ ఆజమ్ మీద   ఎక్కువగా ఆధారపడుతున్నాం. మూడు ఫార్మాట్లలోనూ ఇదే జరుగుతుంది.  కానీ అతడు మాత్రం తన వ్యక్తిగత  రికార్డుల కోసమే  యాభైయ్యో అరవయ్యో పరుగులు చేసి  పెవిలియన్ చేరతాడు. అతడి వల్ల ఓటములే తప్ప జట్టుకు  పెద్దగా ఒనగూరిందేమీ లేదు...’అని అన్నాడు. 

స్వదేశంలో పాకిస్తాన్.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న విషయం తెలిసిందే. మరోవైపు భారత్ మాత్రం సొంతగడ్డపై తమకు అనుకూలించే పరిస్థితుల్లో రెచ్చిపోతున్నదని.. గడిచిన ఐదారేండ్లుగా ఆ జట్టు  చాలా స్ట్రాంగ్ గా మారిందని కనేరియా చెప్పాడు.   పాకిస్తాన్ ఈ విషయంలో ఇండియాను చూసి నేర్చుకోవాలని   సూచించాడు. 

‘న్యూజిలాండ్ తో పాకిస్తాన్ ఇటీవలే వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్ లో మనం ఎప్పుడైనా భారీ స్కోరు చేశామా..?  ఎవరైనా ఆటగాడు డబుల్ సెంచరీ చేశాడా..?   పోనీ  కివీస్ ను దెబ్బతీసేలా  అత్యద్భుత  ప్రదర్శన అయినా ఉందా..? లేదు. అలాంటివి మచ్చుకు కూడా లేవు. ఈ విషయంలో  పాకిస్తాన్ ఇతర దేశాలను, మరీ  ముఖ్యంగా స్వదేశంలో అదరగొడుతున్న టీమిండియాను చూసి నేర్చుకోవాలి. సొంతగడ్డపై పరిస్థితులను వారికి అనుకూలంగా ఎలా మలుచుకోవాలో  ఇండియా నుంచి అలవర్చుకోవాలి..’ అని చెప్పాడు. 
 

Image Credit: Getty Images

న్యూజిలాండ్  భారత్ కంటే ముందు పాకిస్తాన్ లో పర్యటించింది.  అక్కడ 2-1 తేడాతో పాక్ ను ఓడించి వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.  ఈ సిరీస్ లో  పాకిస్తాన్ ఒక్కసారి కూడా 300 పరుగుల మైలురాయిని చేరలేదు. ఓసారి   182కే ఆలౌట్ అయింది కూడా. కానీ భారత్.. తాను ఆడిన గత ఆరు వన్డేలలో  నాలుగు సార్లు 300 ప్లస్ స్కోరు చేసింది. మిగిలిన రెండుసార్లు ఛేదనలో ప్రత్యర్థులు అంత లక్ష్యాన్ని పెట్టలేకపోయాయి. 
 

ఇక పాకిస్తాన్ కు గతంలో ప్రత్యర్థులను భయపెట్టే బౌలర్లు..  దూకుడుగా ఆడే బ్యాటర్లు.. పటిష్టమైన మిడిలార్డర్..  మ్యాచ్ లను మలుపుతిప్పే ఆల్ రౌండర్లు ఉండేవారని.. ఇప్పుడు మాత్రం పాక్ లో అది లోపించిందని  కనేరియా అన్నాడు. 

‘ఒకప్పుడు పాకిస్తాన్ బౌలింగ్ అంటేనే ప్రత్యర్థులు భయపడేవాళ్లు.  బ్యాటర్లను భయపెట్టి  బంతులు విసరగలిగే షోయభ్ అక్తర్ వంటి పేసర్లు ఇప్పుడు లేరు.  సయీద్ అన్వర్, అమీర్ సోహైల్, ఇమ్రాన్ ఫర్హత్, తౌఫీక్ ఉమర్, సల్మాన్ భట్ వంటి ఓపెనర్లు లేరు.   మహ్మద్ యూసుఫ్,  యూనిస్ ఖాన్, ఇంజమామ్ ఉల్ హక్ వంటి మిడిలార్డర్ లేదు.   అబ్దుల్ రజాక్ వంటి ఆల్ రౌండర్లు కూడా లేరు.   ఆ జట్టును చూస్తే ప్రత్యర్థులు భయపడేవాళ్లు. కానీ ప్రస్తుత పాక్ జట్టుకు ఆ సత్తా లేదు..’ అని   వ్యాఖ్యానించాడు. 

click me!