నువ్వు ఎంత గొప్ప ఆటగాడివైనా అప్పుడు నడిచింది.. కానీ ఇప్పుడలా కుదరదు : కోహ్లికి భజ్జీ హెచ్చరిక

First Published Jan 23, 2022, 4:04 PM IST

Harbhajan Singh Warns Virat Kohli:  ప్రస్తుతం భారత జట్టులో చోటు కోసం ఎంతోమంది కుర్రాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ గా ఉన్నన్నాళ్లు  జట్టులో స్థానం గురించి ఆలోచించని కోహ్లికి.. ఇప్పుడు మాత్రం ఆ ఆప్షన్ లేదంటున్నాడు భజ్జీ.. 
 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి గత రెండేండ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతన్నాడు. అయితే కెప్టెన్ గా అప్రతీహాత విజయాలు అందుకున్న కోహ్లి  బ్యాటింగ్ వైఫల్యాల గురించి నోరెత్తని వాళ్లు.. ఇప్పుడు మెల్లగా అతడిపై విమర్శల బాణాలను వదులుతున్నారు.

కెప్టెన్ గా ఉన్న సమయంలో అన్నీ చెల్లుబాటు అయ్యాయి కానీ ఇప్పుడలా కాదని, జట్టులో కోహ్లి కూడా ఓ ఆటగాడు అన్న విషయాన్ని మరిచిపోవద్దని అతడికి సున్నితమైన హెచ్చరికలు కూడా వస్తున్నాయి. 
 

సుమారు రెండేండ్లుగా సెంచరీ చేయని కోహ్లి.. దక్షిణాఫ్రికా పర్యటనలో మునపటి ఫామ్ అందుకుంటాడని అనుకుంటారు. కానీ  విరాట్ మాత్రం  అదే పేలవ ఆటతీరుతో వైఫల్యాలను పునరావృతం చేశాడు. కోహ్లి ఫామ్ పై తాజాగా హర్భజన్ సింగ్ అతడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 

దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లి పేలవ ప్రదర్శనపై భజ్జీ తన యూట్యూబ్ ఛానెల్ లో స్పందిస్తూ... ‘ఏడు సంవత్సరాల తర్వాత ఒక కెప్టెన్ విజయవంతమైనప్పుడు జట్టు సభ్యులతో పాటు అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. కోహ్లి నిర్ణయంపై నేను కూడా  షాక్ కు గురయ్యాను. ఆవేశంలో నిర్ణయం తీసుకుని ఉంటాడని గతంలో అనుకున్నాను. 
 

కానీ కోహ్లి ఏం చేస్తున్నాడో అతడికి తెలుసు.  రాబోయే రోజుల్లో తాను ఎక్కడుండాలనుకుంటున్నాడు..? జట్టులో తన స్థానమేంటి..? అనే విషయాలపై అతడికి అవగాహన ఉంది.  
 

అయితే మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు పరిస్థితులు, జట్టులో ఒక ఆటగాడిగా ఉన్నప్పుడు వేరుగా ఉంటాయి. ఒక బ్యాటర్ గా అతడికి ఇప్పుడు ఒక విచిత్రమైన ఒత్తిడి ఎదుర్కుంటాడు. కోహ్టి పెద్ద ఆటగాడే కావచ్చు, గతంలో పరుగుల వరద పారించి ఉండొచ్చు గానీ జట్టు ఎంపిక విషయంలో అవేవీ  పరిగణనలోకి తీసుకోరు. సదరు ఆటగాడి ప్రదర్శనల కారణంగానే అతడిని ఎంపిక చేయాలా..? వద్దా..? అని ఆలోచిస్తారు...’అని అన్నాడు. 

ఇంకా భజ్జీ మాట్లాడుతూ.. ‘నువ్వు పెద్ద ఆటగాడివే కావచ్చు. నువ్వు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ స్థాయిలో ఆడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు జట్టుకు నాయకుడివి కాదు.  కెప్టెన్ గా ఉన్నప్పుడు నీ ఫామ్ తో సంబంధం లేకుండా నువ్వు జట్టులో ఉంటావు. కానీ ఒక బ్యాటర్ గా వచ్చేసరికి మాత్రం అలా ఉంటే కుదరదు. అలా ఉంటే సెలెక్టర్లు కూడా చూస్తూ కూర్చోరు. గత ఏడేండ్లలో నువ్వు  అలాంటి ఒత్తిడిని ఎదుర్కుని ఉండవు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.
 

ఎందుకంటే  ప్రస్తుతం భారత జట్టులో చోటు కోసం ఎంతోమంది కుర్రాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ల నుంచి కోహ్లికి తీవ్ర పోటీ రావచ్చు. రాబోయే ఐపీఎల్ లో బాగా రాణించిన ఆటగాళ్ల నుంచి కోహ్లి పోటీని ఎదుర్కోవచ్చు. కోహ్లి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని  రాబోయే  రోజుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాడని భావిస్తున్నా. అది  అతడితో పాటు జట్టుకు కూడా మంచిది...’అని హర్భజన్ వ్యాఖ్యానించాడు.

click me!