Kane Williamson: దాని కోసం టీ షర్ట్ కూడా ఇచ్చేసిన కేన్ మామ.. అదే బాటలో అజాజ్ పటేల్..

First Published Dec 8, 2021, 11:48 AM IST

India Vs New Zealand: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ఇటీవలేముగిసిన టెస్టు సిరీస్ లో కివీస్ పరాజయం పాలైంది. కానీ  ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్పిన్నర్ అజాజ్ పటేల్ మాత్రం...!

ఇటీవలే ముంబై వేదికగా ముగిసిన టీమిండియా-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ లో కివీస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఓడినా న్యూజిలాండ్ లోని పలువురు ఆటగాళ్లకు మాత్రం ముంబై స్టేడియం జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాలనిచ్చింది. 

ఒక ఇన్నింగ్సులో పది వికెట్లు తీసిన అజాజ్ పటేల్ కు ఈ టెస్టు ఎంతో ప్రత్యేకం. తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన అజాజ్ తో పాటు  రెండో టెస్టులో ఆడకున్నా కివీస్ సారథి కేన్ విలియమ్సన్ లు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కు మరిచిపోలేని గిఫ్ట్స్ ఇచ్చారు. 

ఎంసీఏ..  త్వరలోనే  ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెటర్లు తమకు నచ్చింది ఏదైనా ఇస్తే బాగుంటుందని ఎంసీఏ సిబ్బంది  కివీస్ మీడియా మేనేజర్ విల్లీ నికోలస్ ను కోరింది.  దీంతో అతడు ఈ విషయాన్ని కేన్ తో పాటు జట్టు సభ్యులకు తెలిపాడు.

విషయం తెలుసుకున్న కేన్ మామ.. కాన్పూర్ టెస్టులో తాను ధరించిన టీషర్ట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. కేన్ తో పాటు అజాజ్ పటేల్ కూడా పది వికెట్లు తీసినందుకు గుర్తుగా ఉంటుందని తన టీషర్ట్ తో పాటు బంతిని కూడా ఇచ్చేశాడు. 

వాంఖెడే స్టేడియానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారత్ లోని ఎంతో మంది క్రికెటర్లు ఈ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసి భారత జట్టుకు ఆడినవాళ్లే. నాటి సునీల్ గవాస్కర్ నుంచి నేటి శ్రేయస్ అయ్యర్ ల వరకు ఇక్కడినుంచి వచ్చినవాళ్లే.. 2011  వన్డే ప్రపంచకప్ ఫైనల్ తో పాటు ఎన్నో చిరస్మరణీయ మ్యాచులకు కూడా వాంఖెడే స్టేడియం వేదికైంది. 

కాగా.. పది వికెట్లు తీసిన బంతితో పాటు టీషర్ట్ ను కూడా ఇచ్చిన అజాజ్ పటేల్ మాట్లాడుతూ... ‘నాకెంతో ఇష్టమైన బంతిని, జెర్సీని ఇక్కడ వదిలివెళ్లడం ఎంతో ప్రత్యేకంగా ఉంది. నా పేరుతో ఉన్న జెర్సీని ఈ మ్యూజియానికి సందర్శించడానికి వచ్చినవాళ్లు చూస్తారు. నా గురించి తెలుసుకుంటారు. భౌతికంగా నేను ఇక్కడ లేకున్నా నా జ్ఞాపకాలు మాత్రం ఇక్కడే ఉంటాయి. నేను ఏదో సాధించానని జనాలు గుర్తిస్తారు..’ అనిఅన్నాడు.

click me!