హర్భజన్ సింగ్ సంచలన నిర్ణయం... వచ్చే వారంలో రిటైర్మెంట్, ఐపీఎల్‌లో ఆ టీమ్‌కి కోచ్‌గా...

First Published Dec 7, 2021, 4:24 PM IST

భారత సీనియర్ మోస్ట్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాడు. 41 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుని, ఐపీఎల్‌లో బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం...

23 ఏళ్ల క్రితం 1998లో ఆస్ట్రేలియాలో మార్చి 25న జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు హర్భజన్ సింగ్. రెండు రంజీ ట్రోఫీల్లో 8 వికెట్లు తీసిన భజ్జీని ఆసీస్ టూర్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు...

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చిన హర్భజన్ సింగ్, సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోనూ ఆడాడు. అయితే సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత భజ్జీ కెరీర్‌ ఊపందుకుంది...

అనిల్ కుంబ్లే గాయపడడంతో ఆస్ట్రేలియా సిరీస్‌కి ఎంపికైన హర్భజన్ సింగ్, 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. హర్భజన్ బౌలింగ్‌తో ఇంప్రెస్ అయిన దాదా, అతనికి వరుస అవకాశాలు ఇచ్చాడు...

2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసిన హర్భజన్ సింగ్, భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు...

2001, మార్చి 11న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించిన భజ్జీ, అదే మ్యాచ్‌లో మాథ్యూ హేడెన్, మార్క్ వాగ్, స్టీవ్ వా, జాసన్ గిలెస్పీ వికెట్లు తీశాడు. 

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకి ఆలౌట్ అయ్యి, ఫాలోఆన్ ఆడిన భారత జట్టు వీవీఎస్ లక్ష్మణ్ 281, రాహుల్ ద్రావిడ్ 180 పరుగుల చేయడంతో 657/7 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసిది. ఈ హ్యాట్రిక్ భజ్జీ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. 

2003 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన హర్భజన్ సింగ్, ఆ టోర్నీలో 3.92 ఎకానమీతో 10 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో భజ్జీ 10 మ్యాచులు ఆడితే, అనిల్ కుంబ్లేకి కేవలం 3 మ్యాచుల్లోనే అవకాశం దక్కడం విశేషం...

గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు ప్రధాన స్పిన్నర్‌గా మారిన హర్భజన్ సింగ్, ఆ తర్వాత అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీల కెప్టెన్సీలోనూ ఆడాడు...

103 టెస్టుల్లో 417 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా ఉన్న హర్భజన్ సింగ్, టెస్టుల్లో రెండు సెంచరీలు, 9 హాఫ్ హాఫ్ సెంచరీలతో 2224 పరుగులు కూడా చేశాడు...

236 వన్డే మ్యాచులు ఆడిన హర్భజన్ సింగ్, 269 వికెట్లు తీశాడు. 28 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు తీసి... ఓవరాల్‌గా 711 అంతర్జాతీయ వికెట్లు తీశాడు..

ఐపీఎల్ 163 మ్యాచుల్లో 150 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ టీమ్‌లలో సభ్యుడిగా ఉన్నాడు...

ఈ ఏడాది కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన హర్భజన్ సింగ్, లీగ్ మొదటి మ్యాచ్‌లో ఓపెనింగ్ ఓవర్ వేశాడు. అయితే మొత్తంగా 3 మ్యాచుల్లో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన భజ్జీకి, ఈ ఏడాది పెద్దగా అవకాశాలు రాలేదు.

చివరిగా భారత జట్టు తరుపున 2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో బరిలో దిగిన హర్భజన్ సింగ్ 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు...

అయితే ఆ తర్వాత హర్భజన్ సింగ్‌కి ఐదేళ్లుగా టీమిండియాలో చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇస్తున్నా, భారత జట్టు సెలక్టర్లు భజ్జీని పట్టించుకోలేదు...

వచ్చే వారం అంతర్జాతీయ క్రికెట్  నుంచి తప్పుకున్న తర్వాత హర్భజన్ సింగ్, ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీకి బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడని సమాచారం...

click me!