Ajaz Patel: కుంబ్లే, జిమ్ లేకర్ కంటే అజాజ్ పర్ఫార్మెన్సే గ్రేట్... ఎందుకో కారణం చెప్పిన కివీస్ మాజీ స్పిన్నర్

First Published Dec 7, 2021, 6:02 PM IST

India Vs New Zealand: సోమవారం ముంబై వేదికగా ముగిసిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన అజాజ్ పటేల్.. అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ ల కంటే ఉత్తమ ప్రదర్శన చేశాడని ఆ దేశానికి చెందిన మాజీ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు.

టీమిండియా-న్యూజిలాండ్ మధ్య సోమవారం ముగిసిన ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పది వికెట్లతో సత్తా చాటిన అజాజ్ పటేల్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్నది.  ఆ టెస్టులో  న్యూజిలాండ్ ఓడినా.. అజాజ్ మాత్రం 14 వికెట్లు తీసి కొత్త రికార్డులు సృష్టించాడు. 

ఒక ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన ఘనత గతంలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే పేరిట మాత్రమే ఉండేది. తాజాగా అజాజ్ కూడా ఆ జాబితాలో  చేరాడు. అయితే కుంబ్లే,  లేకర్ కంటే అజాజ్ పది వికెట్ల ప్రదర్శనే గొప్పదంటున్నాడు  కివీస్ మాజీ స్పిన్నర్ దీపక్ పటేల్. 

ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు స్పిన్ బౌలింగ్ కోచ్ గా ఉన్న దీపక్ పటేల్ మాట్లాడుతూ.. ‘అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ లు ఈ ఫీట్ (పది వికెట్లు) ను రెండో ఇన్నింగ్స్ లో సాధించారు. కానీ అజాజ్ మాత్రం.. టెస్టు తొలి రోజు నుంచే వికెట్ల వేట మొదలుపెట్టాడు. 

అంతేగాక..వాళ్లిద్దరూ సొంతగడ్డ మీదే  పది వికెట్ల ప్రదర్శన నమోదు చేశారు. కానీ అజాజ్ మాత్రం విదేశీ గడ్డ మీద ఈ రేర్ ఫీట్ రికార్డు చేశాడు. నా దృష్టిలో కుంబ్లే, లేకర్ కంటే అజాజ్ ప్రదర్శనే గొప్పది.. 

ఒక స్పిన్నర్ గా పది వికెట్లు తీయడమంటే మాటలు కాదు. అదీ భారత్ వంటి ఉపఖండపు పిచ్ లపై, స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కునే భారత బ్యాటర్లందరినీ ఆలౌట్ చేయడం నిజంగా గొప్ప విషయం. 

మూడేండ్ల క్రితమే టెస్టు జట్టులోకి వచ్చిన అజాజ్.. అనతికాలంలోనే ఈ రికార్డు సాధించడం విశేషం. ముంబై టెస్టులో పది వికెట్ల ప్రదర్శన చేయడానికి అతడు  ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. అతడి బౌలింగ్ లో అది కనబడింది..’ అని దీపక్ పటేల్ అన్నాడు. 

ముంబై టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 47.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అజాజ్.. 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా  నాలుగు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. 

ఇక దీపక్ పటేల్ విషయానికొస్తే.. 1987-1997 వరకు న్యూజిలాండ్ తరఫున ఆడాడు.  37 టెస్టులలో 75 వికెట్లు, 75 వన్డేలలో 45 వికెట్లు (మొత్తం 120 వికెట్లు) తీశాడు. కెన్యాలో పుట్టిన దీపక్ పటేల్.. కివీస్ వెళ్లి అక్కడే సెటిల్ అయి ఆ దేశం తరఫున క్రికెట్ ఆడాడు. 

click me!