ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులకు భారీ షాక్.. టోర్నీ నుంచి తప్పుకున్న నవోమి ఒసాకా

First Published Jan 8, 2023, 4:02 PM IST

Australian Open: 2019, 2021లలో  ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచిన టెన్నిస్ స్టార్, మాజీ వరల్డ్ నెంబర్ వన్ నవోమి ఒసాకా  ఆస్ట్రేలియా  ఓపెన్ నిర్వాహకులకు షాక్ ఇచ్చింది.  

జపాన్   స్టార్ టెన్నిస్ ప్లేయర్, మాజీ వరల్డ్ నెంబర్ వన్  నవోమి ఒసాకా  సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో రెండుసార్లు తాను గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆస్ట్రేలియా ఓపెన్ లో ఈ ఏడాది పాల్గొనడం లేదని తెలిపింది.  

మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో  ఒసాకా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులను షాక్ కు గురిచేసింది.  ప్రతీ ఏడాది   నాలుగు గ్రాండ్ స్లామ్స్ జరుగగా.. అందులో ఆస్ట్రేలియా ఓపెన్ మొదటిది.  సీజన్ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ గా పేరున్న  ఈ మెగా టోర్నీకి   ఒసాకా మాత్రం దూరంగా ఉండనుంది. 

ఈ విషయాన్ని స్వయంగా  ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ‘అవును. ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడటం  లేదు.  ఈ ఏడాది మేం ఆమెను చాలా మిస్ అవుతున్నాం..’ అని ట్విటర్ వేదికగా తెలిపింది.  అయితే ఆమె ఎందుకు తప్పుకుందనే విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. 

అయితే ఇప్పటికే ఈ టోర్నీలో కీలక ఆటగాళ్లు మిస్ అయ్యారు. వరల్డ్ నెంబర్ వన్, యూఎస్ ఓపెన్ ఛాంపియన్ కార్లోస్ అల్కరజ్   కుడి కాలి గాయం కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకున్నాడు.  

అంతేగాక వెటరన్ టెన్నిస్ స్టార్, అమెరికా  క్రీడాకారిణి వీనస్ విలియమ్స్  కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకుంది.  ఇటీవలే  ఆక్లాండ్ లో ముగిసిన ఓ టోర్నీలో ఆమెకు గాయమైంది. దీంతో ఆమె కూడా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంది.  ఇదిలాఉండగా  టోర్నీ ప్రారంభం నాటికి మరెంతమంది గాయాల కారణంగా  ఈ మెగా ఈవెంట్ కు దూరమవుతారో అని నిర్వాహకులు భావిస్తున్నారు. 
 

ఇక ఒసాకా విషయానికొస్తే.. 2019, 2021 లలో ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గిన ఆమె గత సెప్టెంబర్ నుంచి   టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టలేదు. కడుపు నొప్పి,  మానసిక సమస్యల  కారణంగా ఆమె  చాలాకాలంగా  టెన్నిస్ రాకెట్ కు దూరమైంది. 

click me!