ఆసియా కప్ నిర్వహణలో వివాదాలెందుకు..? చర్చించుకుందాం..! జై షాతో చర్చల కోసం యత్నిస్తున్న పీసీబీ చీఫ్..

First Published Jan 11, 2023, 4:10 PM IST

ఈ ఏడాది  సెప్టెంబర్ లో పాకిస్తాన్ వేదికగా పురుషుల ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) జరగాల్సి ఉంది.  అయితే  పాకిస్తాన్ లో  ఈ టోర్నీని నిర్వహిస్తే తాము వెళ్లబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. 

ఆసియా కప్ (2023) ను నిర్వహించి తీరాలని పట్టుదలగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.   పాకిస్తాన్ లో ఈ టోర్నీని నిర్వహిస్తే తాము రాబోమని  ఇప్పటికే స్పష్టం చేసిన భారత్ ను ఒప్పించడానికి పీసీబీ  చైర్మన్ నజమ్ సేథీ కంకణం కట్టుకున్నాడు.

ఆయన త్వరలోనే  బీసీసీఐ సెక్రటరీ, ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు అధ్యక్షుడిగా ఉన్న  జై షా ను కలిసేందుకు రంగం సిద్దం  చేసుకుంటున్నాడు.  దుబాయ్ వేదికగా త్వరలోనే  ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ఐఎల్ టీ20) ప్రారంభం కావాల్సి ఉంది. ఈ లీగ్ ప్రారంభం కోసం ఐసీసీ సభ్య దేశాలతో  ఆహ్వానాలు అందాయి. ఏసీసీ చైర్మన్ హోదాలో  జై షా ఈ టోర్నీకి హాజరయ్యే అవకాశాలున్నాయి. 

ఒకవేళ షా గనక దుబాయ్ వస్తే   నజమ్ సేథీ  అక్కడే  ఆయనతో భేటీ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. పీటీఐలో వచ్చిన కథనం మేరకు.. ఐఎల్ టీ20 ప్రారంభానికి నజమ్ వెళ్లనున్నారు. ఈ అవకాశాన్ని ఆయన షా ను  కలిసేందుకు వాడుకోవాలని భావిస్తున్నాడు.. 

షా తో పాటు ఏసీసీలోని ఇతర సభ్యులను కలిసి  పాకిస్తాన్ లో  టోర్నీ నిర్వహణకు తాము తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లు, ఇతర వివరాలను వారితో పంచుకోనున్నాడు.  ఏసీసీతో మెరుగైన సంబంధాల కోసమే  నజమ్ ఎదురుచూస్తున్నాడు.  ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించేందుకు  గాను సభ్య దేశాల మద్దతును కూడా ఆయన కూడగట్టనున్నారు.  

గతంలో ఏసీసీ చైర్మన్ గా పనిచేసిన నజమ్ సేథీ..  పాకిస్తాన్ కు ఇతర దేశాల క్రికెటర్లు నిశ్చింతంగా పర్యటించవచ్చునని, ఇక్కడ భద్రతకు తాము హామీ ఇస్తామని,  ఆటగాళ్ల రక్షణ విషయంలో చింతించాల్సిన పన్లేదనే విషయాన్ని వాళ్లకు తెలియజేయనున్నాడు.  మిగతా జట్లతో పాటు ఇండియా కూడా  పాకిస్తాన్ కు తమ జట్టును పంపేలా ఆయన చర్చలు సాగనున్నాయి..’అని  పీసీబీ ప్రతినిధి ఒకరు చెప్పారు. 

అయితే  షా దుబాయ్ కు వెళ్తాడా..? వెళ్లినా నజమ్ ను కలుస్తాడా..? అనేది  ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అన్నీ కుదిరితే ఐసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఈ సమావేశం ఉండనున్నట్టు  పీసీబీ వర్గాలు తెలిపాయి.  ఇదిలాఉండగా  పీసీబీ ప్రతిపాదనపై బీసీసీఐ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. 

షెడ్యూల్ ప్రకారం  పాకిస్తాన్ లోనే ఈ ఏడాది ఆసియా కప్ జరగాల్సి ఉంది.  అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా తాము ఆ దేశానికి టీమ్ ను పంపమని, తటస్థ వేదికపై అయితే ఆడతామని బీసీసీఐ ఇదివరకే  స్పష్టం చేసింది.   దీనికి పాకిస్తాన్ కూడా  దీటుగానే బదులిచ్చింది. బీసీసీఐ అలా చేస్తే తాము వన్డే వరల్డ్ కప్ కు ఇండియాకు రాబోమని  తేల్చి చెప్పింది.  రెండు దేశాల మధ్య ఈ వివాదం ముదురుతుండగానే ఇటీవల జై షా ఆసియా కప్ షెడ్యూల్ పై ట్వీట్  చేయడం చర్చనీయాంశమైంది. 

click me!