అఫ్రిది అక్కడ పనిచేయలేడు.. అదో నరకం.. పీసీబీ మాజీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Jan 11, 2023, 1:09 PM IST

PCB: రమీజ్ రాజాను తప్పించిన తర్వాత   పాకిస్తాన్ ప్రభుత్వం.. నజమ్ సేథీని పీసీబీ చీఫ్ గా అఫ్రిదిని  చీఫ్ సెలక్టర్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 
 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)  నుంచి వైదొలిగాక మాజీ చైర్మన్ రమీజ్ రాజా నోటికి పనిచెబుతున్నాడు. బోర్డు పెద్దలతో పాటు  కొత్త  చైర్మన్ నజమ్ సేథీని టార్గెట్ గా చేస్తూ  సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.  తనను అన్యాయంగా  పీసీబీ చీఫ్ పదవి నుంచి తప్పించారని గతంలో ఆరోపించిన రమీజ్ రాజా.. తాజాగా షాహిద్ అఫ్రిదికి చీఫ్ సెలక్టర్ పదవి ఇవ్వడం గురించి మాట్లాడాడు. 

అఫ్రిది పీసీబీలో పనిచేయలేడని, అక్కడి పరిస్థితులు అతడికి అడుగడుగుకూ అవరోధం సృష్టిస్తాయని రమీజ్ రాజా  హెచ్చరించాడు.   కాగా రమీజ్ రాజాను తప్పించిన తర్వాత   పాకిస్తాన్ ప్రభుత్వం.. నజమ్ సేథీని పీసీబీ చీఫ్ గా అఫ్రిదిని  చీఫ్ సెలక్టర్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 

Latest Videos


క్యాపిటల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో   రమీజ్ మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం మేరకు అఫ్రిది అక్కడ (పీసీబీలో) పనిచేయలేడు.   ఒకవేళ నేను ఎక్కడికైనా పని చేయడానికి వెళ్తే.. అక్కడ బాస్ ఎవరు..? నా పై ఉండేవాళ్లు ఎవరు..? నా పనికి అక్కడ విలువ ఉంటుందా..?  నేను అక్కడ సౌకర్యంగా పనిచేయగలుగుతానా..? లేదా..? అన్నది చూసుకుంటా. 

ఆ విషయాల్లో క్లారిటీ వచ్చిన తర్వాతే నేను ఆ పని చేయడానికి అంగీకరిస్తా. ఒకవేళ నాకు  నచ్చకుంటే మాత్రం అక్కడికి వెళ్లను..’ అని చెప్పాడు. పీసీబీ చీఫ్ నుంచి తప్పించినప్పటి నుంచీ  రమీజ్ రాజా.. బోర్డుతో పాటు నజమ్ సేథీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. 
 

అధికారాన్ని అడ్డం పెట్టుకుని  సేథీ  పీసీబీ చైర్మన్ పదవి లాక్కున్నాడని, అతడికి క్రికెట్ గురించిన  అవగాహన ఇసుమంతైనా లేదని రమీజ్ వాపోయాడు. అయితే రమీజ్ ఎన్ని విమర్శలు చేస్తున్నా సేథీ మాత్రం స్పందించడం లేదు.  

గతేడాది ఆస్ట్రేలియాతో  టెస్టు సిరీస్ ఓటమి.. ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అవడంతో పాటు టీ20 ప్రపంచకప్ లో  జట్టు వైఫల్యాల కారణంగా రమీజ్ రాజాపై పాకిస్తాన్ ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే.   ఇక చీఫ్ సెలక్టర్ గా నియమితుడైన అఫ్రిది.. జట్టుకు ఎంపిక కావాలంటే ఆటగాళ్లకు కఠిన పరీక్షలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే  అతడు.. టీ20 జట్టుకు ఎంపిక కావాలనుకున్నవాళ్ల  స్ట్రైక్ రేట్ 135 కి తక్కువగా ఉండొద్దని, అలా ఉంటే వారిని సెలక్షన్స్ లో పట్టించుకోమని చెప్పిన విషయం తెలిసిందే. 

click me!