అశ్విన్‌ని లెగ్ స్పిన్ వేయొద్దని చెప్పిన ముత్తయ్య మురళీధరన్.. ఎందుకని అడిగితే...

First Published Aug 26, 2022, 5:14 PM IST

టెస్టుల్లో అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. బ్యాటుతో కూడా రాణించగల రవి అశ్విన్‌ని టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2022 టోర్నీకి కూడా ఎంపిక చేశారు సెలక్టర్లు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అశ్విన్. దీని వెనక భారత కెప్టెన్ రోహిత్ శర్మ హస్తం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆడిన రవి అశ్విన్, అన్నీ కుదిరితే వచ్చే టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆడే అవకాశం ఉంది...

టీమిండియా తరుపున 86 టెస్టులు ఆడి 442 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, 113 వన్డేల్లో 151 వికెట్లు పడగొట్టాడు. 51 టీ20 మ్యాచులు ఆడి 61 వికెట్లు తీశాడు. కెరీర్ ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన రవిచంద్రన్ అశ్విన్, లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ దగ్గర ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు...

అయితే రవిచంద్రన్ అశ్విన్‌ని లెగ్ స్పిన్‌ వేయొద్దని సూచించాడట ముత్తయ్య మురళీధరన్. దీని గురించి ఈ ఇద్దరి మధ్య పెద్ద చర్చే జరిగింది. ‘నా స్కూల్ రోజుల్లో నేను లెగ్ స్పిన్ వేసేవాడిని. ఎందుకంటే అప్పుడు లంక జట్టులో ఉన్న రువాన్ కల్పగే ఆఫ్ స్పిన్నర్. అదే టీమ్‌లో మరో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా ఉండేవాడు. 

ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఉన్న జట్టులోకి రావాలంటే నేను వారికి భిన్నంగా ఏదైనా చేయగలగాలి. అందుకే లెగ్ స్పిన్ వేసేవాడిని. లెగ్ స్పిన్ వేయగలను కానీ ఇన్ని వికెట్లు తీయగలననే నమ్మకం నాకు ఉండేది కాదు. లెగ్ స్పిన్ వేయడం, బంతిని స్పిన్ చేయడం, గూగ్లీలు వేయడం తేలికే కానీ బంతిని కరెక్ట్‌ ప్లేస్‌లో వేయడం చాలా కష్టం...’ అని చెప్పాడు ముత్తయ్య మురళీధరన్... 

దానికి వెంటనే అశ్విన్.. ‘మరి నేను లెగ్ స్పిన్ వేయాలని అనుకుంటే మీరు ఎందుకు వద్దని చెప్పారు. ‘లెగ్ స్పిన్ ఎందుకు వేస్తున్నావ్? ఆఫ్ స్పిన్ వేయ్యు... నువ్వు ఆఫ్ స్పిన్ బాగా వేస్తున్నావ్...’ అని ఎందుకు చెప్పారు? అని అడిగాడు... అశ్విన్ ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పాడు ముత్తయ్య మురళీధరన్...

‘నేను లెగ్ స్పిన్ వేసింది జట్టులో చోటు దక్కించుకోవడానికి. ఇప్పుడు టీమిండియాకి కేవలం లెగ్ స్పిన్నర్లు మాత్రమే కావాలనుకుంటే నువ్వు లెగ్ స్పిన్ వేస్తే సరిపోతుంది... అయితే ఎప్పుడైతే వికెట్లు తీస్తామో అప్పుడే బౌలర్ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది....

బౌలింగ్ నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉపయోగించే అస్త్రం. అంతేకానీ లెగ్ స్పిన్ వేయగలను అని చెప్పుకోవడానికి లెగ్ స్పిన్ వేయొద్దు. దానికి బదులుగా ఆఫ్ స్పిన్‌లో వికెట్లు తీయగలిగితే అదే చేయడం మంచిది కదా... కెరీర్‌లో నేను కూడా చాలా సార్లు వికెట్లు తీయలేక జట్టులో చోటు కోల్పోయాను...

వన్డేల నుంచి వాళ్లు నన్ను తప్పించారు. అయితే నేను లెగ్ స్పిన్ వేయలేదు. నేను ఆఫ్ స్పిన్‌తోనే వికెట్లు తీయగలనని నిరూపించాలని అనుకున్నాను. అదే చేశాను... నేను నీకు చెప్పింది ఇదే...’ అంటూ వివరించాడు ముత్తయ్య మురళీధరన్...

‘నేను చాలా చిన్నతనం నుంచే క్రికెట్ కావాలని కలలు కన్నాను. 8 ఏళ్ల నుంచే ఆడడం మొదలెట్టా. అప్పుడు ఫాస్ట్ బౌలర్‌ కావాలని ఆశపడ్డాను. నాకు స్పిన్ సహజంగా వచ్చేదేమీ కాదు. 

Muttiah Muralitharan

అండర్ 13 లెవెల్‌కి వచ్చినప్పుడు నా కోచ్, నువ్వు ఇంత కంటే పొడువు పెరగవు, కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ నీకు వర్కవుట్ కాదని చెప్పారు. స్పిన్ ట్రై చేయమని చెప్పారు... అలా స్పిన్ బౌలర్‌ని అయ్యా...’ అంటూ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ముత్తయ్య మురళీధరన్.. 

click me!