కష్టమైన పని మీరు చేయండి, సులువైన పని నేను చేసి... హర్ధిక్‌ని అడ్డుపెట్టుకుని ధోనీని ట్రోల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్

First Published Aug 10, 2023, 12:40 PM IST

వెస్టిండీస్ టూర్‌లో మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత మూడో టీ20లో ఘన విజయం అందుకుంది టీమిండియా. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో హార్ధిక్ ఆటతీరు తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమైంది..
 

ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 1, శుబ్‌మన్ గిల్ 6 పరుగులకే అవుట్ కావడంతో 34 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కలిసి మూడో వికెట్‌కి కీలకమైన 87 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
 

సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేసి అవుట్ కాగా తిలక్ వర్మ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విజయానికి 2 పరుగులు కావాల్సిన స్థితిలో హార్ధిక్ పాండ్యా సిక్సర్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేయడంతో తిలక్ వర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోలేకపోయాడు.

Latest Videos


Dhoni-Pandya

సిక్సర్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసిన హార్ధిక్ పాండ్యా, ధోనీలాంటి ఫినిషర్ అనే ప్రశంసలు వస్తాయనుకుంటే... ‘సెల్ఫిష్ కెప్టెన్’ అంటూ తీవ్రంగా ట్రోల్ చేసేస్తున్నారు టీమిండియా అభిమానులు. ఆ ఓవర్‌కి ముందే చివరిదాకా ఉండి, మ్యాచ్ ఫినిష్ చేయాలని తిలక్ వర్మకు చెప్పాడు హార్ధిక్ పాండ్యా. పాండ్యా ఇలా చెప్పడం వల్లే తిలక్ వర్మ భారీ షాట్లు ఆడలేదు..

హార్ధిక్ సింగిల్ తీస్తే, తిలక్ వర్మకు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం దక్కేది. అయితే కావాలనే హార్ధిక్, తిలక్‌కి ఆ ఛాన్స్ ఇవ్వలేదని... అతన్నో ‘సెల్ఫిష్ క్రికెటర్’గా చూపిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ చేస్తున్నారు...

Irfan Pathan

టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘కష్టమైన పని మీరు చేయండి, తేలికైన పని నేను తీసుకుంటా.. ఇది ఎక్కడో విన్నట్టుంది కదూ..’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్..  ఈ ట్వీట్‌లో పేరు చెప్పకపోయినా, ఇది ధోనీ గురించేనని అందరికీ అర్థమైపోయింది.

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఫైనల్‌లో సెహ్వాగ్, సచిన్ అవుటైన తర్వాత గంభీర్, కోహ్లీ కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. దాదాపు మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చిన తర్వాత ధోనీ క్రీజులోకి వచ్చాడు, అది కూడా యువరాజ్ సింగ్ ప్లేస్‌లో.. 
 

Image Credit: Getty Images

అప్పటిదాకా 2011 వన్డే వరల్డ్ కప్‌లో 362 పరుగులు, 15 వికెట్లు తీసి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన యువరాజ్ సింగ్‌ని కాదని బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న ధోనీ, హెలికాఫ్టర్ సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించి క్రెడిట్ మొత్తం కొట్టేశాడు.. ఈ ఇన్నింగ్స్ కారణంగా యువీ అప్పటిదాకా చేసిన దానికంటే, ధోనీ హెలికాఫ్టర్ షాట్‌కే ఎక్కువ క్రేజ్ దక్కింది..

హార్ధిక్ పాండ్యా కూడా మూడో టీ20లో మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చిన తర్వాత సంజూ శాంసన్ కంటే ముందు బ్యాటింగ్‌కి వచ్చాడు. సంజూ శాంసన్ వచ్చి ఉంటే, అతను కచ్ఛితంగా తిలక్ వర్మకు స్ట్రైయిక్ ఇచ్చేవాడు. ఐపీఎల్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ కోసం వైడ్ బాల్‌ని డిఫెండ్ చేశాడు సంజూ... 

తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసుకుంటే క్రెడిట్ అంతా అతనికి, సూర్యకుమార్ యాదవ్‌కి వెళ్తుందనే ఉద్దేశంతో సిక్సర్ కొట్టి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. మొత్తానికి హార్ధిక్‌ని అడ్డుపెట్టుకుని, ఇర్ఫాన్ పఠాన్ మరోసారి ధోనీని ట్రోల్ చేశాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. ఓ రకంగా 2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ఫినిషింగ్ సిక్సర్‌కీ, మూడో టీ20లో హార్ధిక్ కొట్టిన సిక్సర్‌కీ పెద్ద తేడా లేదంటున్నారు ధోనీ హేటర్స్.. 

click me!