క్రికెట్ ఫుల్ సక్సెస్.. ఫుట్‌బాల్‌పై కన్నేసిన అంబానీ.. ఆ ఫ్రాంచైజీని కొనే యోచనలో రిలయన్స్..!

First Published Dec 13, 2022, 12:35 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్  ప్రథమస్థానంలో ఉంటుంది. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన  ముంబై యాజమాన్యం..  ఇప్పుడు  ఇతర లీగ్  ల మీద దృష్టి   సారించింది. 

భారత్ లో జరిగే ఐపీఎల్  తో పాటు యూఏఈలో ఇంటర్నేషనల్ టీ20 లీగ్, దక్షిణాఫ్రికా వేదికగా  జరుగబోయే  ఎస్ఎ20 లో  పెట్టుబడులు పెట్టిన   రిలయన్స్ యజమాని  ముఖేష్ అంబానీ కన్ను ఇప్పుడు ఫుట్‌బాల్ మీద పడింది. త్వరలోనే ఆయన  ఓ దిగ్గజ  ఫుట్‌బాల్ ఫ్రాంచైజీకి ఓనర్ కాబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 

ఇంగ్లీష్ ప్రీమియర్  లీగ్ (ఈపీఎల్) లో  విజయవంతమైన అర్సెనల్ ఫుట్‌బాల్ జట్టు ను  కొనుగోలు చేసేందుకు  అంబానీలు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.  ఇప్పటికే ఈ ఫుట్‌బాల్ క్లబ్  ప్రతినిధులతో  అంబానీల చర్చలు ముగిశాయని, ఒప్పందానికి సంబంధించిన తుది  చర్చలు జరుగుతున్నాయని  తెలుస్తున్నది. 

ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ  అర్సెనల్  ఫుట్‌బాల్ టీమ్ కు వీరాభిమాని.  ముంబై ఇండియన్స్ తో పాటు  ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ కేప్‌టౌన్ లకు ఆయనే యజమానిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా  అర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్ ను దక్కించుకోవడానికి ఆయనే ఆసక్తి చూపుతున్నాడని సమచారం.  

వాస్తవానికి అర్సెనల్ కంటే ముందు మాంచెస్టర్ యూనైటెడ్ ను అంబానీలు కొనుగోలు చేస్తారని వార్తలు వచ్చాయి. ఈపీఎల్ లో మాంచెస్టర్ యూనైటెడ్ కు  మంచి క్రేజ్  ఉంది.  సాకర్ దిగ్గజం  క్రిస్టియానో రొనాల్డో కూడా  నిన్నా మొన్నటి దాకా ఈ క్లబ్ తోనే ఆడాడు.  

మాంచెస్టర్ యూనైటెడ్ తో పాటు లివర్‌పూల్ ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి కూడా  అంబానీలు ఆసక్తి చూపించినా చివరికి  అర్సెనల్ వైపే మొగ్గుచూపారని సమాచారం. అంబానీలు అర్సెనల్ డీల్ వ్యవహారానికి సంబంధించిన తుది వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. 

click me!