సీనియర్లను దారిలోకి తెచ్చేందుకు మాహీ వాడిన అస్త్రం అదే... లేటుగా వచ్చే ప్లేయర్లకు...

First Published Dec 23, 2021, 3:52 PM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోలిస్తే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సమయంలో టీమిండియా పరిస్థితులు వేరు. కేవలం మూడేళ్ల అంతర్జాతీయ అనుభవం మాత్రమే ఉన్న మాహీ, అప్పటికే 15-20 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న సీనియర్లతో కూడిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు...

రాజకీయాలు, ఉద్యోగాలు, కాలేజీల్లాగే భారత క్రికెట్ టీమ్‌లో కూడా సీనియారిటీకి ప్రాధాన్యం ఉండేది. టీమ్‌లోకి వచ్చే కుర్రాళ్లు, సీనియర్లకు గౌరవం ఇవ్వాల్సిందే...

ఈ పాయింట్‌ను వాడుకుని భారత జట్టులోని చాలామంది సీనియర్లు, ప్రాక్టీస్ సెషన్స్‌, టీమ్ మీటింగ్స్‌కి చాలా లేటుగా వచ్చేవాళ్లు. అంతేందుకు హోటల్ గదుల్లో నుంచి టీమ్ బస్సులోకి వచ్చేందుకు కూడా తాపీగా చాలా సమయం తీసుకునేవాళ్లు...

సీనియర్ ప్లేయర్లు వచ్చేదాకా జూనియర్ ప్లేయర్లు, కోచ్‌, మిగిలిన సిబ్బంది... వెయిట్ చేస్తూ కూర్చునేవాళ్లు. భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ వంటి ప్లేయర్ల విషయంలోనూ ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి...

అయితే మాహీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్లేయర్లలో ఉన్న క్రమశిక్షణారాహిత్యాన్ని పోగొట్టాలని అనుకున్నాడు. అయితే జట్టులో ఉన్న ప్లేయర్లలో ఎక్కువ మంది తనకంటే సీనియర్లే...

వారికి ఎలా చెప్పాలో తెలియక హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ సహకారంతో ఓ కొత్త రూల్‌ను తీసుకొచ్చాడు అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...

ఏ ప్లేయర్ అయినా ప్రాక్టీస్‌కి కానీ, టీమ్ బస్సు ప్రారంభమయ్యే సమయానికి కానీ లేటుగా వస్తే... ఏకంగా రూ.10 వేలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది...

ఈ రూల్ పెట్టిన ప్రారంభంలో కొందరు సీనియర్లు పట్టించుకునేవాళ్లు కాదట. అయితే సీనియర్లే కట్టకపోతే, జూనియర్లు ఎలా ఈ రూల్ ఫాలో అవుతారని మాహీ అండ్ కో చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో చెల్లించేవారట..

ఇలా కొద్ది రోజుల్లోనే భారత జట్టులో చాలా మార్పు కనిపించిందట. లేటుగా వస్తే, ఏకంగా రూ.10 వేలు ఫైన్ కట్టాల్సి వస్తుందని, షెడ్యూల్ టైం కంటే ముందే వాలిపోయేవారట...

‘ఎమ్మెస్ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కొత్తలో సీనియర్ల ప్రవర్తన, టీమ్‌కి తలనొప్పిగా మారింది. దాంతో ఆలస్యంగా వస్తే రూ.10 వేలు ఫైన్ కట్టాలని మాహీ నిబంధన తీసుకొచ్చాడు. ఈ రూల్‌ కారణంగా జట్టులో చాలా మార్పు కనిపించింది...’ అంటూ తెలిపాడు అప్పటి టీమిండియా మెంటల్ కండీషనింగ్, స్ట్రాటెజిక్ లీడర్‌‌షిప్ కోచ్ ప్యాడీ అప్టన్...

ఇదే క్రమశిక్షణను అలవర్చుకున్న విరాట్ కోహ్లీ, అందరికంటే ముందు తానే ప్రాక్టీస్ సెషన్స్‌కి కానీ, టీమ్ మీటింగ్స్‌కి వచ్చేవాడట. మాహీ కెప్టెన్సీతో పోలిస్తే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సీనియర్ల సంఖ్య తక్కువ కావడంతో వారిని నియంత్రించడం పెద్ద కష్టం కాలేదు..

దాదాపు 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం వచ్చిన తర్వాత భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ, యువకులతో నిండిన జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తిగా మారింది...

click me!