ఆ విషయంలో టెండూల్కర్‌ కంటే ధోనీ ఎక్కువే... మాహీకి ఇంత క్రేజ్ రావడానికి కారణమేంటి?

First Published Jul 7, 2022, 10:28 AM IST

కెప్టెన్లు వస్తుంటారు, పోతుంటారు... అయితే భారత క్రికెట్ జట్టుపై మాహీ వేసిన మార్కు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది... అలాగే ఎందరు క్రికెటర్లు వచ్చినా ఎమ్మెస్ ధోనీ క్రేజ్ వేరే లెవెల్. రాంఛీలో జన్మించిన మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి క్రేజ్, ఫాలోయింగ్ ఎలా వచ్చాయి...

Dhoni sachin

క్రికెట్ ప్రపంచంలో క్రేజ్ గురించి మాట్లాడాల్సి వస్తే, ముందు సచిన్ టెండూల్కర్ గురించి ప్రస్తావించిన తర్వాతే ఎవ్వరి పేరైనా ప్రస్తావించాలి. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే యావత్ భారతం స్థంభించిపోయేది... 

బ్యాటుతో అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేస్తే సచిన్ టెండూల్కర్‌కి అంతటి క్రేజ్ తెచ్చుకోవడం సాధ్యమైంది. అయితే సచిన్‌తో పోలిస్తే మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటుతో అంతలా ఇరగదీసిందేమీ లేదు. లోయర్ ఆర్డర్‌లో వస్తూ వన్డేల్లో 10 వేల పరుగులు అందుకోవడం మినహా ఎమ్మెస్ ధోనీ పేరిట అదిరిపోయే రికార్డులు కూడా ఏమీ లేవు. విదేశాల్లో మాహీకి చెప్పుకోదగ్గ రికార్డు కూడా లేదు... మరి మాహీకి ఇంతటి క్రేజ్ ఎలా వచ్చింది...

Latest Videos


‘సచిన్ టెండూల్కర్‌కి ముంబై, మహారాష్ట్రలోనే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు. విరాట్ కోహ్లీకి బెంగళూరులోనే... అయితే మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం దేశమంతటా ఉంటారు. మాహీ ఫాలోయింగ్ చూస్తే మెంటల్ ఎక్కేస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

మాహీకి ఇంతటి మాస్ ఫాలోయింగ్ రావడానికి ముఖ్యకారణం 2007 టీ20 వరల్డ్ కప్. భారీ అంచనాలతో 2007 వన్డే వరల్డ్ కప్ బరిలో దిగి, గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్ చేతుల్లో చిత్తుగా ఓడింది టీమిండియా. ఈ పరాజయంతో భారత క్రికెటర్ల ఇళ్లపై దాడులు జరిగాయి. మాహీ ఇంటిపై రాళ్లతో దాడి చేసి, ఆయన కటౌట్లను కాల్చి వేశారు అభిమానులు...

2007 వన్డే వరల్డ్ కప్ పరాభవంతో టీ20 వరల్డ్ కప్‌కి సీనియర్లు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో అనుకోకుండా టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఎమ్మెస్ ధోనీ, కుర్రాళ్లతో నిండిన టీమ్‌ని వరల్డ్ ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ విజయంతోనే మాహీ స్థాయి ఆకాశాన్ని తాకింది. ఎమ్మెస్ ధోనీ అనే పేరు ఓ బ్రాండ్‌గా మారిపోయింది..

ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్‌ విజయం... ఆ క్రేజ్‌ని వంద రెట్లు పెంచేసింది. ఒక్క వరల్డ్ కప్ వస్తే చాలనుకున్న టీమిండియా ఫ్యాన్స్‌కి రెండు టైటిల్స్ ఇవ్వడంతో మాహీ ఓ దేవుడిలా మారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతీ చిన్న విజయం ధోనీ ఫాలోయింగ్‌ని మరింత పెంచుతూ పోయాయి...

వాస్తవానికి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలకు ఉన్నట్టే ఎమ్మెస్ ధోనీకి కూడా హేటర్స్ చాలా మంది ఉన్నారు. రెండు వరల్డ్ కప్ విజయాల్లో మాహీ చేసింది తక్కువే, అయినా జట్టును విజయవంతంగా నడిపించడంతో ఎక్కువ క్రెడిట్ దక్కింది. ఇదే గౌతమ్ గంభీర్ లాంటి వాళ్లకు మాహీ అంటే అస్సలు గిట్టకుండా చేసింది...

కెప్టెన్ అయ్యాక మాహీ బ్యాటింగ్‌లో దూకుడు తగ్గింది. వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువ బాల్స్ ఆడేవాడు. దీంతో మాహీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒకప్పుడు మాహీని దేవుడు అన్నవాళ్లే, ఇప్పుడు అతను జట్టుకి భారమని విమర్శించారు. ఇలాంటి విమర్శలు సచిన్ టెండూల్కర్, కపిల్‌దేవ్ లాంటి లెజెండ్స్ కూడా ఫేస్ చేశారు...

అయితే వారితో పోలిస్తే మాహీకి పరుగు ఎప్పుడు ఆపాలో కూడా బాగా తెలుసు. అందుకే జట్టులో తన ప్లేస్‌కి ఢోకా లేకపోయినా తనని తీసివేసే ఆలోచన కూడా టీమ్‌కి రాకముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. వీటికి తోడు ‘ఎమ్మెస్ ధోనీ’ బయోపిక్ కూడా మాహీని ఓ సూపర్ హీరోలా జనాల్లోకి తీసుకెళ్లింది...

విరాట్ కోహ్లీ ఎవరో కూడా తెలియని మారుమూల పల్లెటూరి జనాలకు కూడా మాహీ ఓ బ్రాండ్‌లా పరిచయమయ్యాడు. అందుకే ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ ప్రస్తావన వచ్చినా... మాహీ గురించి నాలుగు మాటలు, ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగినా ‘ధోనీ... ధోనీ...’ అనే అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి, ఉంటాయి కూడా...

విరాట్ కోహ్లీతో పోలిస్తే మహేంద్ర సింగ్ ధోనీ చాలా కూల్ అండ్ కామ్. ఎంతో ప్రశాంతంగా ఉంటూ, అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ... కొన్ని కోట్ల మందికి రోల్ మోడల్‌గా మారిపోయాడు. ఆన్ ఫీల్డ్ మాహీ బిహేవియర్‌ కూడా మిగిలిన క్రికెటర్ల కంటే ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణమైంది..

క్రికెట్, బయోపిక్ రూపంలో సినిమా మాత్రమే కాకుండా ఫ్యాషన్ వరల్డ్ కూడా మాహీని జనాల్లోకి వెళ్లేలా చేసింది. జులపాల జట్టుతో ఎంట్రీ ఇచ్చిన మాహీ, దాన్ని ఓ ట్రెండ్‌గా మార్చేశాడు. మాహీ కారణంగా బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీ హీరో ఈ జులపాల జట్టు ట్రెండ్‌ను ఫాలో అవ్వాల్సి వచ్చింది.. 

click me!