
భారత్-ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా చివరి టెస్టు లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగింది. ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు క్రికెట్ చరిత్రలో ఓ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్‌పై కేవలం 6 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది మన హైదరాబాదీ సిరాజ్ మియా.. సూపర్ స్టార్ మహమ్మద్ సిరాజ్. క్యాచ్ వదిలిన ఒత్తిడిలోనూ అద్భుతమైన కమ్ బ్యాక్ తో తిరిగి వచ్చి 5 వికెట్లతో ఇంగ్లాండ్ ను చిత్తు చేశాడు. భారత్ కు అద్భుత విజయాన్ని అందించాడు.
టెస్టు చివరి రోజు ఉదయం ఇంగ్లాండ్‌కు విజయం కోసం కేవలం 35 పరుగులే అవసరం. ఇంకా నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి. దాదాపు ఇంగ్లాండ్ గెలుపు పక్కా అనే అంచనాలున్నాయి. కానీ, అంచనాలను యంగ్ ఇండియా తలకిందులు చేసింది. ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది. ఈ అద్బుత విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. అవసరమైన సమయంలో కీలక వికెట్లు తీసుకున్నాడు.
తన రెండో కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించిన సిరాజ్ గస్ అట్కిన్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్ వేసిన బంతి వేగంగా దూసుకు వచ్చి స్టంప్‌ను కొట్టింది.. దెబ్బకు మిడిల్ స్టంప్ ఎగిరిపడింది. ఈ వికెట్‌తో మ్యాచ్ మళ్లీ భారత్ చేతుల్లోకి వచ్చింది. చివరికి ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్ మ్యాచ్‌లో 104 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 9 వికెట్లు తీసుకున్నాడు.
సిరాజ్ కేవలం చివరి రోజు మాత్రమే తన హీరోయిజాన్ని చూపించలేదు. అతని బౌలింగ్ సామర్థ్యం కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం కాలేదు. రెండో రోజే సిరాజ్ మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. భారత్ 270 పరుగులకు ఆలౌటైన తర్వాత ఇంగ్లాండ్ 109/1 వద్ద ఆటను కొనసాగిస్తున్న సమయంలో సిరాజ్ దూకుడు చూపించాడు.
మొదట ఒలీ పోప్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఆ తర్వాత జో రూట్‌ను పెవిలియన్ కు పంపాడు. డెబ్యూటెంట్ జేకబ్ బెథెల్‌ను కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. చివరగా హ్యారీ బ్రూక్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 109/1 నుంచి 247 పరుగులకు కుప్పకూలింది. ఆ స్పెల్‌లో సిరాజ్ 4 వికెట్లు తీసి 86 పరుగులు ఇచ్చాడు. ఇది మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
భారత్ చివరి ఇన్నింగ్స్‌లో 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. మూడో రోజు ఆఖరి ఓవర్‌లో సిరాజ్ అద్భుతమైన యార్కర్‌తో జాక్ క్రాలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది ఆ టెస్టులో అత్యంత కీలకమైన బంతిగా నిలిచింది. మ్యాచ్ ఫ్లోను భారత్ వైపు మళ్లించింది.
ఈ ఐదు వికెట్ల ఘనత కేవలం గణాంకాల కోసం కాదు. బుమ్రా లేని సమయంలో భారత జట్టును అద్భుతమైన బౌలింగ్ తో నిలబెట్టిన గర్వించదగ్గ క్షణాలు. విశ్రాంతి లేకుండా మొత్తం ఐదు టెస్టు లలో ఆడాడు. ఏకంగా 185 ఓవర్లు బౌలింగ్ వేశాడు. తక్కువ పరుగులు ఇస్తూ 23 వికెట్లు పడగొట్టాడు. వర్క్ లోడ్ ఉన్నప్పటికీ అద్భుతమైన బౌలింగ్ తో సిరాజ్ తన నైపుణ్యం, నిబద్ధతను ప్రదర్శించాడు.
ఈ మ్యాచ్‌లో సిరాజ్ఆ 200 అంతర్జాతీయ వికెట్ల మార్కును కూడా దాటాడు. టెస్ట్ సిరీస్‌లో భారత్ తరపున ఇంగ్లాండ్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇది అతని సామర్థ్యానికి అద్దం పట్టే సందర్భంగా చెప్పవచ్చు. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు సిరాజ్ తీసుకున్నాడు.
ఈ మ్యాచ్ విజయంలో ఇతర ప్లేయర్ల సహకారం ఉన్నప్పటికీ, ఈ గెలుపు సిరాజ్ సూపర్ బౌలింగ్ తోనే సాధ్యమైందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రెండో రోజు బ్రేక్‌త్రూ లేకపోతే ఇంగ్లాండ్ లీడ్ తీసుకునేది. మూడో రోజు క్రాలీ వికెట్ లేకపోతే సులభంగా మ్యాచ్ జారిపోయేదే. ఐదో రోజు ఆఖరి స్పెల్ లేకపోతే భారత్ ఓటమిని చవిచూసేది. ఈ సందర్భాలన్నింటినీ సిరాజ్ మార్చేశాడు.
ఈ మ్యాచ్ తర్వాత సిరాజ్ “ఇది జట్టు కోసం. నా గుండెతో బౌలింగ్ చేశా” అని అన్నాడు. కానీ ఈ విజయం సాధారణ ప్రదర్శన కాదు, అగ్నిపరీక్షగా చెప్పవచ్చు. ఇందులో సిరాజ్ విజయం సాధించాడు. భారత్ కు అద్భుత విజయం అందించాడు.
హైదరాబాద్ వీధుల్లో ప్రారంభమైన సిరాజ్ ప్రయాణం, లండన్ ఓవల్‌లో ఉన్నత శిఖరాలకు చేరింది. ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. క్రికెట్ ప్రపంచం ముందు ఇప్పుడు సిరాజ్ఆ ఒక నిజమైన హీరోగా నిలిచాడు.