మిచెల్ స్టార్క్ చేసిన పని, బుమ్రా చేస్తాడా... ఇండియాకి ఆడడం కోసం ఐపీఎల్‌కి దూరంగా ఉండగలడా?...

First Published Oct 2, 2022, 5:36 PM IST

ఆస్ట్రేలియా వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లకు పుట్టినిల్లు. ఆసీస్ తరుపున అదరగొడుతున్న సీనియర్ మోస్ట్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆసీస్ టీమ్‌కి పూర్తి ఫిట్‌గా అందుబాటులో ఉండేందుకు ఐపీఎల్‌తో పాటు పూర్తిగా ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచే దూరంగా ఉండాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు మిచెల్ స్టార్క్...

Mitchell Starc

32 ఏళ్ల మిచెల్ స్టార్క్, 2010లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. 12 ఏళ్ల కెరీర్‌లో 71 టెస్టులు, 105 వన్డేలు, 51 టీ20 మ్యాచులు ఆడిన మిచెల్ స్టార్క్, మొత్తంగా 450+అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున రెండు సీజన్లు ఆడిన మిచెల్ స్టార్క్, గాయం కారణంగా 2016 సీజన్ ఆడలేదు. 2018 సీజన్‌లోనూ కేకేఆర్ కొనుగోలు చేసినా స్టార్క్ గాయంతో అప్పుడు కూడా బరిలో దిగలేదు...

2022 మెగా వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకోని మిచెల్ స్టార్క్, బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టు తరుపున రెండు సీజన్లు ఆడాడు. గాయాలతో సతమతమవుతూ కెరీర్‌లో అనేక బ్రేకులు తీసుకున్న మిచెల్ స్టార్క్, ఫ్రాంఛైజీ లీగుల్లో ఆడకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నాడు...

మిచెల్ స్టార్క్ నిర్ణయంతో జస్ప్రిత్ బుమ్రాని టార్గెట్ చేస్తున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్. భారత ప్లేయర్లు రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ కూడా తరుచుగా గాయపడుతూ క్రికెట్‌కి దూరంగా ఉంటున్నారు. గత రెండేళ్లలో ఆరుసార్లు గాయపడిన రవీంద్ర జడేజా, ఆడిన మ్యాచుల కంటే జట్టుకి దూరమైన మ్యాచుల సంఖ్యే ఎక్కువ...

Image credit: Getty

కెఎల్ రాహుల్‌ది సేమ్ ఇదే పరిస్థితి. జస్ప్రిత్ బుమ్రా కూడా ఈ లిస్టులో చేరిపోయాడు. వెన్ను గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, రీఎంట్రీ తర్వాత సరిగ్గా 6 ఓవర్లు బౌలింగ్ మాత్రమే చేసి తిరిగి గాయపడ్డాడు. దీంతో ఇలాంటి ప్లేయర్లు కూడా ఐపీఎల్‌కి దూరంగా ఉండడమే బెటర్ అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

రెండున్నర నెలల పాటు జరిగే ఐపీఎల్‌కి దూరంగా ఉంటే జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ వంటి తరుచూ గాయపడుతున్న ప్లేయర్లకు కావాల్సినంత విశ్రాంతి సమయం దొరుకుతుంది, అదీకాక తిరిగి గాయపడే ప్రమాదం కూడా తప్పుతుంది...

bumrah

అయితే మిచెల్ స్టార్క్ తీసుకున్నట్టు ఐపీఎల్‌కి దూరంగా ఉండాలంటే ఈ ముగ్గురూ కోట్ల రూపాయలను వదులుకోవాల్సి ఉంటుంది. కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2022 ద్వారా రూ.17 కోట్లు వెనకేసుకోగా రవీంద్ర జడేజా రూ.16 కోట్లు, జస్ప్రిత్ బుమ్రా రూ.12 కోట్లు ఖాతాలో వేసుకున్నారు...

Image credit: Getty

భారత జట్టుకి అందుబాటులో ఉండేందుకు ఇన్ని కోట్లు వదులుకునేందుకు మన క్రికెటర్లు సిద్ధంగా ఉంటారా? అంటే... అది అసాధ్యమనే చెప్పాలి. అవసరమైతే ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీశమ్‌ల మాదిరిగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడేందుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు మరికొందరు...

click me!