బుమ్రా లేకుండా గెలవలేమా..? గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

First Published Oct 2, 2022, 4:11 PM IST

Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి  తిరిగబెట్టడంతో దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. టీ20   ప్రపంచకప్ లో కూడా అతడు ఆడేది అనుమానమే.. 

Image credit: Getty

భారత జట్టు ప్రధాన బౌలర్  బుమ్రాకు గాయం తిరగబెట్టడంతో అతడు  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నుంచి వెనుదిరిగాడు. ప్రస్తుతం బుమ్రా.. బెంగళూరులోని ఎన్సీఏలో రీహాబిటేషన్ లో ఉన్నాడు.  అతడి వెన్ను నొప్పికి సంబంధించిన చికిత్స జరుగుతున్నది. మరి సౌతాఫ్రికా సిరీస్ నుంచి  తప్పుకున్న బుమ్రా ప్రపంచకప్ కు కూడా అనుమానమే అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.  

అయితే ఈ అనుమానాలను, ఆరోపణలను బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా కొట్టిపారేశారు. బుమ్రా  టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకోలేదని.. అతడు ఆస్ట్రేలియాలో జరుగనున్న మెగా టోర్నీ వరకు కోలుకుంటాడని  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే వీరి మాటలను టీమిండియా ఫ్యాన్స్ నమ్మడం లేదు. బీసీసీఐ  వాస్తవాలు చెప్పడం లేదని.. బుమ్రా ప్రపంచకప్ లో ఆడటని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. బుమ్రా లేకుండా టీమిండియా ప్రపంచకప్ గెలవడం  కష్టమేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో అసలు బుమ్రా లేకుండా భారత్ ప్రపంచకప్ గెలవలేదా..?  గడిచిన రెండేండ్లలో బుమ్రా.. టీ20లో ఆడిన మ్యాచ్ లు ఎన్ని..? గెలిచిన మ్యాచ్ లు ఎన్ని..? అనే విషయాలు ఇక్కడ  చూద్దాం. 

2020 నవంబర్ నుంచి టీమిండియా మొన్న తిరువనంతపురంలో ముగిసిన మ్యాచ్ తో కలిపి 49 టీ20 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 34 విజయాలు సాధించగా.. 14 మ్యాచ్ లలో ఓడింది. ఒకదాంట్లో ఫలితం తేలలేదు.  
 

బుమ్రా విషయానికొస్తే.. ఇందులో (49) పది టీ20లు మాత్రమే ఆడాడు. బుమ్రా ఆడిన పది మ్యాచ్ లలో టీమిండియా 8 గెలిచింది. రెండింట్లో ఓడింది.  బుమ్రా లేకుండా టీమిండియా 39 మ్యాచ్ లు ఆడి  ఏకంగా 26 మ్యాచ్ లలో విజయాలు సాధించింది. 12 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఒకదాంట్లో ఫలితం తేలలేదు.  

గణాంకాలను బట్టి చూస్తే బుమ్రా లేకున్నా భారత్ విజయాలు ఆగిపోలేదు. అదీగాక ఇవన్నీ ఏదో అల్లాటప్పా జట్ల మీద సాధించిన గెలుపులు కూడా కావు. 2020 డిసెంబర్ లో ఆస్ట్రేలియా పై, 2021  మార్చిలో ఇంగ్లాండ్ పైన సాధించిన విజయాలూ ఉన్నాయి.  టీ20కి అసలైన జట్టుగా ఉన్న వెస్టిండీస్ పై కూడా ఇటీవలే టీమిండియా బుమ్రా లేకుండానే సిరీస్ గెలుచుకుంది. 

ఈ నేపథ్యంలో బుమ్రా  ఉంటే టీమిండియాకు అదనపు బలం.. అంతేగానీ అతడు లేనంత మాత్రానా అంత హైరానా పడాల్సిన అవసరంలేదన్న అభిప్రాయమూ వినిపిస్తున్నది.  అలా అంటే అప్పటికే స్టార్ పేసర్ హోదా దక్కించుకున్న జహీర్ ఖాన్ లేకుండానే టీమిండియా.. 2007 ప్రపంచకప్ లో గెలవలేదా..? అనే వాదనలూ  ఉన్నాయి.

click me!