ఆసియాలో కరేబియన్ వీరుడు.. ఆఫ్రికాలో ఆసియా స్పిన్నర్.. తమ సారథులను పరిచయం చేసిన ముంబై..

First Published Dec 2, 2022, 5:23 PM IST

Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ తో పాటు ఇతర దేశాలలో జరిగే లీగ్ లలో కూడా అడుగుపెట్టబోతున్నది. 

ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండిన్స్  శుక్రవారం మరో కీలక  ప్రకటన చేసింది.  వచ్చే ఏడాది యూఏఈ వేదికగా ప్రారంభం కాబోతున్న  ఇంటర్నేషనల్ లీగ్ (ఐఎల్ టీ20) కు ఇప్పటికే సారథిని ప్రకటించిన ముంబై తాజాగా సౌతాఫ్రికా టీ20 (ఎస్ఎ టీ20 లీగ్)  లీగ్ కు కూడా కెప్టెన్ ను ప్రకటించింది.

ఐఎల్ టీ20 లో ముంబై ఎమిరేట్స్ కు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ కీరన్ పొలార్డ్  ను సారథిగా  ప్రకటించిన ముంబై యాజమాన్యం.. తాజాగా   ఎస్ఎ 20 లో ముంబై కేప్‌టౌన్ కు ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను కెప్టెన్ గా నియమించింది.
 

ఈ మేరకు ముంబై ఇండియన్స్ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ముంబై యజమాని  ఆకాశ్ అంబానీ స్పందిస్తూ.. ‘వచ్చే సీజన్ లో వివిధ లీగ్ లలో మా  ఫ్రాంచైజీలకు సారథులుగా వ్యవహరించేది వీళ్లే..  పొలార్డ్, రషీద్ లు  ఐఎల్ టీ20, ఎస్ఎ టీ20లలో ముంబై  ప్రతిష్టను మరింత  ముందుకు తీసుకెళ్తారని  భావిస్తున్నా..’ అని తెలిపాడు.

ఎంఐ ఎమిరేట్స్ కు డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహీర్ వంటి ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించనున్న విషయం తెలిసిందే.  ఐఎల్టీ20 లీగ్ జనవరి 13 నుంచి ప్రారంభం కాబోతున్నది. ఎమిరేట్స్ జట్టుకు  షేన్ బాండ్  హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు.

ఇక దక్షిణాఫ్రికా లీగ్ లో   రషీద్ ఖాన్ తో పాటు డెవాల్డ్ బ్రెవిస్, కగిసొ రబాడా,   రస్సీ వన్ డర్ డసెన్,  జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్ లు ఉన్నారు. కేప్‌టౌన్ జట్టుకు  సైమన్ కటిచ్ హెడ్ కోచ్ గా ఉండగా  హషీమ్ ఆమ్లా బ్యాటింగ్ కోచ్ గా నియమితుడయ్యాడు.

click me!