రిటైర్మెంట్ ప్రకటించిన మనోజ్ తివారి... సెంచరీ చేసినా, 4 వికెట్లు తీసినా.. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లి...

First Published Aug 3, 2023, 6:09 PM IST

భారత క్రికెటర్ మనోజ్ తివారి, అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2008 ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మనోజ్ తివారి, తన కెరీర్‌లో 12 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడాడు..

12 వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో 287 పరుగులు చేసిన మనోజ్ తివారి, బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. 3 టీ20 మ్యాచుల్లో ఒకేసారి బ్యాటింగ్‌కి వచ్చిన మనోజ్ తివారి, 15 పరుగులు చేశాడు. 

2011లో వెస్టిండీస్‌తో జరిగిన ఐదో వన్డేలో మొదటి ఓవర్‌లో 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన మనోజ్ తివారి, 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సెంచరీకి ముందు నుంచే మోకాళ్లు పట్టేయడంతో తెగ ఇబ్బంది పడిన మనోజ్ తివారి, సెంచరీ తర్వాత రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు...

Latest Videos


గౌతమ్ గంభీర్‌తో కలిసి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మనోజ్ తివారి, విరాట్ కోహ్లీతో కలిసి నాలుగో వికెట్‌కి 117 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 126 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 104 పరుగులు చేసిన మనోజ్ తివారి... ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోవడం విశేషం..
 

Manoj Tiwary

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 80 పరుగులు చేయగా, రోహిత్ శర్మ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 21 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా, వెస్టిండీస్‌పై 34 పరుగుల తేడాతో విజయం అందుకుంది..
 

అద్భుత సెంచరీ కారణంగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్న మనోజ్ తివారి, అద్భుత శతకం తర్వాత కూడా 14 మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. 15 మ్యాచుల తర్వాత లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మ ప్లేస్‌లో ఆల్‌రౌండర్‌గా మనోజ్ తివారికి తిరిగి జట్టులో చోటు దక్కింది.

శ్రీలంకతో కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన మనోజ్ తివారి, బ్యాటింగ్‌లో 21 పరుగులు చేశాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్‌లో, ఆసియా కప్ 2012 టోర్నీలో మనోజ్ తివారి... రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు..
 

టీమిండియా తరుపున దక్కిన అతి తక్కువ అవకాశాల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ సురేష్ రైనా, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్ల కారణంగా మనోజ్ తివారికి రావాల్సినన్ని అవకాశాలు అయితే రాలేదు. 

ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 119 మ్యాచులు ఆడిన మనోజ్ తివారి, ఓ త్రిబుల్ సెంచరీతో పాటు 27 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు సాధించి 8752 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 31 వికెట్లు పడగొట్టాడు. లిస్టు ఏ క్రికెట్‌లో 163 మ్యాచులు ఆడిన తివారి, 6 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలతో 5466 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 60 వికెట్లు పడగొట్టాడు..

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కత్తా నైట్‌రైడ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరుపున ఆడిన మనోజ్ తివారి, 98 మ్యాచులు ఆడి 1695 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 
 

క్రికెటర్‌గా కొనసాగుతున్న సమయంలోనే 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ, ఆల్ ఇండియా ట్రినముల్ కాంగ్రెస్ పార్టీ తరుపున సిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన మనోజ్ తివారీ, ప్రస్తుతం బెంగాల్ క్రీడాశాఖ మంత్రిగా ఉన్నాడు. 

click me!