Ind Vs Pak: అలా చేస్తే ఇక నుంచి ప్రతి ఏడాది ఇండియా-పాక్ సిరీస్.. ఐసీసీ ముందు రమీజ్ రాజా కొత్త ప్రతిపాదన..

First Published Jan 13, 2022, 4:24 PM IST

Ramiz Raja New Proposal: దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక  సిరీస్ ల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మెన్ రమీజ్ రాజా  సరికొత్త ప్రతిపాదనతో ఐసీసీ ముందుకొచ్చాడు.  

ప్రపంచ క్రికెట్ లో ఇతర జట్లకు లేని క్రేజ్ భారత్-పాకిస్థాన్ మ్యాచులకు ఉంది. యాషెస్ తో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్ వైరం కొనసాగుతున్నా.. ఇండియా-పాకిస్థాన్ లతో పోల్చితే అది కూడా తక్కువే అనిపించక మానదు. 
 

అయితే గత కొన్నాళ్లుగా ఈ దాయాది దేశాల మధ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. సరిహద్దుల్లో మన  సైనికుల మీద  పాక్ దాడులు,  బోర్డర్ లో అక్రమ చొరబాట్లతో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరుగడం లేదు.

ఎప్పుడో ఐసీసీ టోర్నీలలో తప్ప భారత్-పాకిస్థాన్ మ్యాచులు చూడాలనుకునే వారికి తీవ్ర నిరాశ ఎదురవుతున్నది. గతేడాది అక్టోబర్ లో ముగిసిన  ఇండియా-పాకిస్థాన్ మ్యాచుకు టీవీలలో  వ్యూయర్షిప్ లు కొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. 
 

ఈ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఏడాదికోసారి టీ20 సిరీస్ నిర్వహించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా సరికొత్త ప్రతిపాదనతో ఐసీసీ ముందుకొచ్చాడు. 

ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక  సిరీస్ లు జరగాలని మేం కోరుకుంటున్నాం. ఒకసారి  మీరు గత మ్యాచుల వ్యూయర్షిప్ ల రికార్డులు చూడండి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం మనల్నే చూస్తున్నది. 

అభిమానులకు ఏం కావాలో గమనించండి. దానికి అనుగుణంగా మనం చేద్దాం. భారత్-పాకిస్థాన్ సిరీస్ ల మాదిరిగానే యాషెస్ లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మ్యాచులకు కూడా మంచి వ్యూయర్షిప్ దక్కుతున్నది..’ అని పేర్కొన్నాడు. 

అంతేగాక.. ‘భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లతో నాలుగుదేశాల మధ్య  ప్రతి సంవత్సరం ఒక టీ20 నిర్వహించాలని మేం పరిశీలిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే తయారుచేశాం. దానిని ఐసీసీ ముందు ఉంచుతాం. ఈ టోర్నీ నాలుగు దేశాల్లో జరిగే విధంగా ప్లాన్ చేశాం..’ అని ట్వీటాడు. 
 

ఈ సిరీస్ ను రొటేషన్ పద్దతిలో  ఒక్కో ఏడాది ఒక్కో దేశంలో నిర్వహించే విధంగా పీసీబీ రూపొందించినట్టు రమీజ్ రాజా  తన ప్రతిపాదనలలో పేర్కొన్నాడు. తద్వారా ఆదాయాన్ని  సమంగా పంచుకునేందుకు వీలుంటుందని తెలిపాడు.
 

అయితే రమీజ్ రాజా ప్రతిపాదనపై ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.  ఈ ప్రపోజల్ పై ఇటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గానీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గానీ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గానీ ఇప్పటివరకూ  స్పందించలేదు.  
 

కాగా గ‌తేడాది టీ20 వ‌రల్డ్‌క‌ప్‌లో టీమిండియాపై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. త‌ద్వారా ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌ల‌లో భార‌త్‌పై ఆ జ‌ట్టు తొలి సారి విజ‌యం న‌మోదు చేసింది. ఈ మ్యాచును ఏకంగా 15.9  బిలియన్ల (సుమారు 150 కోట్లు) మంది వీక్షించినట్టు (టీవీ, సోషల్ మీడియా, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లన్నింటిలో కలిపి) గణాంకాలు చెబుతున్నాయి. 

click me!