Legends League Cricket: యూసుఫ్ పఠాన్ వీర విధ్వంసం.. ఆసియా సింహాలపై ఇండియన్ మహారాజులదే గెలుపు

First Published Jan 21, 2022, 10:42 AM IST

Yusuf Pathan: భారత్ తరఫున ఆడినప్పుడు ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడిన యూసుఫ్ పఠాన్ మరోసారి అదే స్థాయిలో చెలరేగాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఉప్పెన సృష్టించాడు.  
 

టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ వీర విధ్వంసం సృష్టించాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్  2022లో  యూసుఫ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండియా మహారాజాకు  లీగ్ లో తొలి విజయం అందించాడు. 
 

గురువారం ఆసియా లయన్స్ తో జరిగిన తొలి మ్యాచులో  ఇండియన్ మహారాజాస్ జట్టు ఘన విజయం సాధించింది. మహ్మద్ కైఫ్ నేతృత్వంలోని మహారాజులు.. పాకిస్థాన్ మాజీ ఆటగాడు  మిస్బా ఉల్ హక్ సారథ్యంలోని  ఆసియా లయన్స్ ను మట్టికరిపించారు. 

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. మాజీ శ్రీలంక ఓపెనర ఉపుల్ తరంగ (46 బంతుల్లో 66 పరుగులు.. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు)  మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 
 

పాకిస్థాన్ మాజీ  సారథి మిస్బా ఉల్ హక్ (30 బంతుల్లో 44 పరుగులు.. నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్), కమ్రాన్ అక్మల్ (17 బంతుల్లో 25) రాణించడంతో ఆసియా లయన్స్ భారీ స్కోరు చేసింది. ఇర్పాన్ పఠాన్ రెండు వికెట్లు తీశాడు.

భారీ లక్ష్య ఛేదనలో ఇండియా మహారాజుల జట్టు  ఆదిలోనే స్టువర్ట్ బిన్నీ,  బద్రీనాథ్ వికెట్లను కోల్పోయింది  అనంతరం  కెప్టెన్ మహ్మద్ కైఫ్ (42) తో కలిసి యూసుఫ్ చెలరేగాడు.

40 బంతుల్లోనే 80 పరుగులు చేసిన యూసుఫ్.. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. అతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు  ఉన్నాయి. కైఫ్ తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన యూసుఫ్.. రనౌట్ కావడంతో సంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 
 

ఇక చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (10 బంతుల్లో 21.. 2 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగి ఆడటంతో ఇండియన్ మహారాజులను విజయం వరించింది. మరో ఐదు బంతులు మిగిలుండగానే ఆ జట్టు  విజయాన్ని అందుకుంది. 

click me!